Why are fans so obsessed with Pawan Kalyan’s OG movie? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమరోగిపోతుంది. 100% స్ట్రైక్ రేట్తో 2024 ఎలక్షన్లో సంచలన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తనదైన శైలి రాజకీయాన్ని జనాలకు పరిచయం చేస్తున్నారు. సినిమా హీరోకి రాజకీయాలు ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ కి రాజకీయాల గురించి ఏమైనా తెలుసా? చక్కగా సినిమాలు చేసుకోవడం మానేసి ఎందుకు ఈ రాజకీయాలు? తన అన్న చిరంజీవి లాగే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేసేస్తాడు? మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాడు ప్రజలకు మేలు చేస్తాడా? ప్యాకేజీ తీసుకున్న వాడు పవర్ లోకి రాగలడా? అంటూ ఎలక్షన్స్ ముందు ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ని అనని మాట లేదు. అన్ని మాటలకు కాలమే సమాధానం చెబుతుంది అన్నట్టుగా తన పని తాను నిజాయితీగా చేసుకుపోయిన పవన్ కళ్యాణ్ను ప్రజలు నమ్మారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో తన జనసేన పార్టీకి అద్భుతమైన ఘనవిజయం అందించారు. ఇక రాజకీయ నాయకుడిగా అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో మమేకమయ్యారు. తనదైన మార్కు పరిపాలనతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వాళ్ల అవసరాలు తీరుస్తూ ప్రత్యర్థులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అయితే గతంలో సినిమా హీరోగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తను చేస్తున్న సినిమాలకు కామా పెట్టి ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా గానీ సినిమాల ప్రస్తావన వస్తూనే ఉంది. అందులో ప్రధానంగా ఓ జి సినిమా గురించి చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నా అక్కడున్న యూత్ అలాగే సినిమా అభిమానులు ఓ జి.. ఓ జి అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజకీయనాయకులకు నిరసన సెగ తగిలినట్టు పవన్ కళ్యాణ్ కి ఓ జి సెగ మాత్రం తప్పటం లేదు.
పవన్ కు గట్టిగా తగులుతున్న ఓ జి సెగ
Why are fans so obsessed with Pawan Kalyan’s OG movie?
డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం పేరు ఓ జి అనే సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. అందులో మొదటిది హరిహర వీరమల్లు కాగా, రెండవ సినిమా ఓజి, మూడవ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమాలన్నిటిలోకి జనాలు ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్న సినిమా మాత్రం ఓ జి. ఈ సినిమాపై ఎందుకు అంత క్రేజ్? రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఓజి ఎప్పుడు విడుదలవుతుంది అని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు ఈ సినిమా కోసం ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోనూ, నిజజీవితంలోనూ ఎంత సాధారణంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారో ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళగానే అంతే స్టైలిష్ యాక్టర్ గా పవన్ కళ్యాణ్ మారిపోతారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మరే ఇతర హీరోకు లేనటువంటి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇవే పవన్ కళ్యాణ్ కు తన అభిమానుల్లో అంతులేని ఇమేజ్ ని క్రియేట్ చేశాయి. తన మొదటి సినిమా తర్వాత ఒక డిఫరెంట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ స్టైల్ తోనే అశేష అభిమానుల ఆధారాభిమానులను సొంతం చేసుకున్నారు.
పవన్ స్టైల్ గా డైలాగ్ చెప్పినా, అంతే స్టైల్ గా ఫైట్ చేసిన థియేటర్లో అభిమానులకి పూనకాలు వచ్చేస్తాయి. పవన్ నటించిన ఒక సాధారణ సినిమాకు కూడా అసాధారణ విజయాన్ని కట్టపెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమాలు కూడా ఇతర హీరోల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ కి సమానంగా ఉండడానికి కారణం పవన్ యాక్టింగ్ స్కిల్స్ కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా కారణమని చెప్పాలి. పవన్ ని ఒక నటుడు గానే కాకుండా వ్యక్తిత్వపరం గానూ ఎంతో ఇష్టపడతారు ఆయన అభిమానులు. అందుకే ఆయన ప్లాప్ సినిమాలో కలెక్షన్ మరొక హీరో హిట్ సినిమాకి సమానం అని అంటారు ట్రేడ్ పండితులు. కెమెరా ముందు ఎంతో స్టైలిష్ గా పెర్ఫార్మ్ చేసే పవన్ కళ్యాణ్ తో యంగ్ డైరెక్టర్ సుజీత్ ఓ జి సినిమాని తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా సుజిత్ కు సినిమా ఇండస్ట్రీలోనూ, అలాగే సినీ అభిమానుల్లోనూ ఎంతో క్రేజ్ ఉంది. పైగా డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ సినిమా ఎప్పుడు చేస్తాడా అని అభిమానులంతా ఎదురు చూస్తున్న టైం లో సుజీత్ ఈ ఓ జి సినిమాని ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే ఇప్పటికే ఓజి రిలీజ్ అయ్యి సంవత్సరం దాటేది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా బిజీ అవ్వ డంతో ఓ జి సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓజి సినిమాకి సంబంధించి చిన్న టీజర్ ను ఆ మధ్య రిలీజ్ చేయగా, యూట్యూబ్లో అది రికార్డుల పరంపర కొనసాగించింది. అందులో పవన్ కళ్యాణ్ గెటప్, స్టైల్ డైలాగ్ డెలివరీ అభిమానుల్ని విశేషంగా అలరించాయి. ఇలాంటి సినిమా కదా మన పవన్ కళ్యాణ్ కి పడాల్సింది అంటూ సగటు అభిమానులంతా ఓ జి సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ ఓజి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? స్క్రీన్ పై స్టైలిష్ పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
ఓ జి విడుదల ఎప్పుడు?
పరిపాలనపరంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ కి ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్లినా ఈ ఓ జి సినిమా సెగ మాత్రం తగలకుండా ఉండటం లేదు. పవన్ కళ్యాణ్ మరో 15 రోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తి అయిపోతుంది. ఆయన లేని సీన్సు అన్నీ ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసేసాడు డైరెక్టర్ సుజీత్. ప్రస్తుతం రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్య హరిహర వీరమల్లు సినిమా కోసం కొన్ని రోజులు పని చేశారు. మార్చి చివరి వారంలో హరిహర వీరమల్లు విడుదల కాబోతుంది. అలాగే ఓ జి సినిమా నిర్మాతలకు తాజాగా డేట్స్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. అందుకే దర్శకుడు రీసెంట్గా బ్యాంకాక్ వెళ్లి పవన్ కళ్యాణ్ లేని కొన్ని సీన్స్ ని షూట్ చేసుకుని వచ్చాడు. పవన్ కొన్ని రోజులే ఈ సినిమాకి పనిచేయాల్సి ఉంది కాబట్టి హరిహర వీరమల్లు తర్వాత అంటే దసరాకి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు వలన పవన్ ఇమేజ్ ఇండియా వైడ్ పెరగడంతో ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ భాషల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు లాంగ్ హెయిర్ తో ఉండడంతో హరిహర వీరమల్లు సినిమాకి ఆ గెటప్ సెట్ అవుతుంది. అది కంప్లీట్ అయినాకే ఓజే సినిమాకి డేట్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అవ్వడం వలన ఓజి సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉంది. అతి త్వరలోనే మిగిలి ఉన్న తన పార్ట్ ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తిచేయనున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోమని ఓజి సినిమా నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్.
సో అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఓ జి సినిమా సమ్మర్ తర్వాత వినాయక చవితి గానీ, లేక దసరాకి కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పొలిటికల్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ పనితనాన్ని చూసి మురిసిపోతున్న పవన్ ఫ్యాన్స్ కు ఓజి గా పవన్ నట విశ్వరూపాన్నిచూడాలని ఎంతో ఆశ పడుతున్నారు. రాజకీయంగా సరికొత్త ప్రకంపనలు సృష్టించిన పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఈ ఓ జి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకుడు హరిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా సినిమాలకి స్వస్తి చెప్తారో లేదా ఇంకా కంటిన్యూ చేస్తారో ఆయనకే తెలియాలి.
నిజమైన ట్రెండ్ సెట్టర్..పవర్ స్టార్
నేను ట్రెండును ఫాలో అవ్వను సెట్ చేస్తాను.. ఇది పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ లో డైలాగ్. నిజమే.. సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా నిజంగా పవన్ ట్రెండ్ సెట్టర్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే మాట ఇది. అధికారంలోకి వచ్చిన మొదలు నుంచీ కూడా ఇప్పటివరకు తనదైన విధి విధానాలతో, పరిపాలన సంస్కరణలతో పాలనలో పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకుపోతున్నారు. ఈయనకి రాజకీయాలేం తెలుసులే అన్న జనాలు, ప్రత్యర్థులు అవాక్కయ్యేలా పవన్ కళ్యాణ్ చర్యలు రాష్ట్ర ప్రజలని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలుశాఖలను తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ శాఖలపై చాలా త్వరగానే విపరీతమైన పట్టు సాధించి ఆయా శాఖలలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రతి గ్రామంలోనూ రక్షిత మంచినీరు ఉండేటట్టుగా ఆయన ప్రణాళికలు సాగుతున్నాయి. అలాగే ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఇలా కూడా చేయొచ్చా.. ఇలా కూడా మాట్లాడవచ్చా.. ఇలా కూడా జనాల్లో కలిసిపోవచ్చా.. అనే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఒక సరికొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు అందుకే సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇప్పుడు కొణిదెలపవన్ కళ్యాణ్ ఓ న్యూ ట్రెండ్ సెట్టర్.