Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again? మన ఇండియన్ సినిమాకి, ముఖ్యంగా మన తెలుగు సినిమాకి పాటలనేవి ఒక ముఖ్యమైన భాగమని చెప్పాలి. ఎవరో సినిమా కవి చెప్పినట్టు పాటకి ప్రాణం పల్లవి ఐతే, సినిమాకి ప్రాణం మాత్రం పాటలే. పాటలు లేని తెలుగు సినిమాని గానీ, మరే ఇతర భాషా సినిమాని గానీ మనం చాలా తక్కువగా చూస్తుంటాం. కథలో భాగమై సినిమా కథని ముందుకు తీసుకెళ్ళే పాటలు కొన్ని ఉంటే, కథకి అడ్డం పడినా, ప్రేక్షకుల్ని థియేటర్స్ కి మళ్ళీ మళ్ళీ రప్పించే యుగళగీతాలు, రొమాంటిక్ సాంగ్స్, హీరో డాన్స్ నంబర్స్ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో జానర్ సాంగ్స్ సినిమా విజయాల్లో మేజర్ పార్ట్ కొట్టేస్తుంటాయి. పాటలెన్ని ఉన్నా మన తెలుగు సినిమాకి సంబంధించి, ఐటమ్ సాంగ్స్ కి ఉన్న కిక్ వేరు. సినిమా విజయంలో బిగ్గెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్ గా ఐటమ్ సాంగ్స్ ముందునుండీ సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నాటి జ్యోతి లక్ష్మి, జయమాలినీ నుండి ఇప్పటి టాప్ హీరోయిన్స్ అందరూ ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడిన వారే. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే, ఐటమ్ గర్ల్స్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పటి ట్రెండ్ లో ఎంత టాప్ హీరోయిన్ అయినా ఐటమ్ సాంగ్ అంటే సై అంటున్నారు..కాకపోతే రెమ్యునరేషన్, కాస్టూమ్స్ తదితర విషయాల్లో కొన్ని షరతులు వర్తిస్తాయి అంతే.
అ..అంటే, అలా మొదలయ్యింది.
మన తెలుగు సినిమాకి సంబంధించి ఎన్నో వేల ఐటమ్ సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఐతే ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగ్స్ కి ఒక స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిన కాంబినేషన్ గా డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. తన మొదటి సినిమా ఆర్య నుండి, ఇప్పటి పుష్ప-2 వరకూ దర్శకుడు సుకుమార్ ఒక్క దేవి శ్రీ ప్రసాద్ తోనే పని చేసారు. వేరే ఏ ఇతర సంగీత దర్శకులను ఇప్పటి వరకూ సుకుమార్ ఎప్పుడూ తన సినిమాల కోసం తీసుకోలేదు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ మూవీ ‘ఆర్య’ మ్యూజికల్ గా సంచలనం సృష్టించడంలో ఈ కాంబినేషన్ పునాది బలంగా పడింది.
రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్ కి మన నేటివిటీ కథల్లోని కిక్ ఏమిటో బాగా అర్ధం అయ్యింది. అందుకే ఊరమాస్ కథతో అల్లు అర్జున్ ని పుష్ప గా చూపించి, అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పాలి. అప్పటివరకూ స్టైలిష్ హీరో గా కనిపించిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఒక కూలీగా ఊర మాస్ అవతారం ఎత్తి దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నాడు. మొదట తెలుగు సినిమాగా మొదలైన పుష్ప బన్నీ ప్లానింగ్ తో పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యింది. తెలుగులో మంచి టాక్ తో మొదలైన పుష్ప మిగతా భాషల్లో రైజ్ అవ్వడానికి ఒక వారం టైం తీసుకుంది. వారం తర్వాత పుష్ప జైత్రయాత్ర నెల తిరిగేటప్పటికి ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా పుష్ప మానియానే. పుష్ప మొదటి పార్ట్ బంపర్ హిట్ కొట్టడంతో పార్ట్ 2 పైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఐటమ్ సాంగ్ విషయానికొస్తే ‘ఊ అంటావా మావా’ అంటూ టాప్ హీరోయిన్ సమంత పుష్ప రాజ్ రేంజ్ ని ఎక్కడికో తీసుకుపోయింది. గణేష్ ఆచార్య డాన్సు కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో డాన్స్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఐటమ్ సాంగ్ అంటే ఎప్పడూ హుషారు గీతాల్ని అందించే దేవి శ్రీ ప్రసాద్ ఈసారి డిఫరెంట్ గా స్లో పాయిజన్ సాంగ్ ని కంపోజ్ చేసాడు. సింగర్ మంగ్లి చెల్లి ఇంద్రావతి చౌహాన్ తన హస్కీ వాయిస్ తో ఈ పాటకి ప్రాణం పోసిందని చెప్పాలి.
రెండో పుష్పరాజ్ మాత్రం..తగ్గేదేలే
దేశవ్యాప్తంగా పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించిన తర్వాత ఇప్పడు అందరి దృష్టి పుష్ప ది రూల్ పైనే ఉంది. బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత, బాహుబలి 2 కోసం అప్పట్లో దేశం మొత్తం ఎంతగా ఎదురుచూసిందో మనకు తెలిసిందే. అంతకంటే ఎక్కువగా ఇప్పడు పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఒక రేంజ్ లో పుష్పరాజ్ కోసం వేచి చూస్తున్నారు. అందుకే మొదటి భాగాన్ని తలదన్నేలా ఈ సినిమాని సుకుమార్ సిద్ధం చేస్తున్నాడు. మొదటి భాగం విడుదల అయిన మూడేళ్లకి వచ్చే నెల డిసెంబర్ 5 న పుష్ప 2 విడుదల అవుతుందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ రెండో భాగం పై ఎంత కేర్ తీసుకున్నారో. అల్లు అర్జున్ కూడా ఈ మూడేళ్ళు వేరే సినిమా చేయకుండా పుష్ప మీదే ఫోకస్ పెట్టాడు. ఆ ప్రభావం ఇప్పడు సినిమాపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఐటమ్ సాంగ్ గురించి వేరే చెప్పలా..అల్లు అర్జున్, సుకుమార్, దేవి కలిసారంటే అది మాములుగా ఉండదు గా. మొదటి పార్ట్ లో సమంతా తో చేసి, కాక పెంచిన సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ తో చేయిస్తున్నట్టు టాక్. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందట. పుష్ప మొదటి భాగంలో కూడా ఐటమ్ సాంగ్ ఆఖరులో షూట్ చేసారు. అదే సెంటిమెంట్ తో వచ్చే నెలలో వస్తోన్న పుష్ప 2 కి కూడా ఐటమ్ సాంగ్ ఆఖరులోనే షూట్ చేస్తున్నారు. ఇప్పడు అందరి దృష్టి డిసెంబర్ 5 పైనే. పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించబోయే ప్రభంజనం పైనే. పుష్ప రాజ్ మరోసారి భారీ సక్సెస్ కొట్టి తెలుగు వాడి సత్తా చాటాలని కోరుకుందాం.
ఆర్య తో పుట్టిన సెంటిమెంట్ Pushpa 2: The Rule Will Allu Arjun Sukumar Devi Sri Prasad Create A Musical Sensation Once Again?
ఆర్య సినిమాలోని ఐటమ్ సాంగ్ ఆ..అంటే అమలాపురం..అమలాపురం నుండి అమెరికా వరకూ మారుమోగిపోయింది. అల్లు అర్జున్ రెండో సినిమా, సుకుమార్ కి మొదటి సినిమా అయిన ఆర్య అప్పట్లో జనాల్లోకి వేగంగా దూసుకెళ్లడానికి ఈ పాట, ఆ సినిమాకి ఎంతో హెల్ప్ అయ్యింది. ఆడియో పరంగా ఈ ఐటమ్ సాంగ్ సూపర్ గా రావడంతో ఎవరైనా స్టార్ హీరోయిన్ తో ఈ సాంగ్ చేయాలి అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్. సిమ్రాన్ గానీ, సాక్షి శివానంద్ గానీ ఐతే డాన్స్ పరంగా కూడా బాగా వస్తుంది అనుకున్నారట. ఐతే సుకుమార్ కి అదే మొదటి సినిమా కావడంతో, నిర్మాత దిల్ రాజు కూడా అప్పటికి ఒక్క సినిమానే తీసి ఉండడంతో నిర్మాణ వ్యయం కంట్రోల్ లో ఉండాలని అభినయశ్రీ ని నిర్మాత దిల్ రాజు ఒకే చేసారట. అభినయశ్రీ ని మొదట డైరెక్టర్ సుకుమార్ వద్దన్నా తర్వాత డాన్స్ లో ఆమె గ్రేస్ చూసి ఫైనల్ గా ఓకే చెప్పారట. దర్శకుడు సుకుమార్ కి అంతగా ఇష్టం లేకుండా షూట్ చేసిన ఆ ఐటమ్ సాంగ్ సినిమా విజయంలో కీలకంగా మారిపోయింది. సీనియర్ గీత రచయిత వేటూరి రాసిన ఈ సాంగ్ ఐటమ్ సాంగ్స్ లోనే ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి ఐటమ్ సాంగ్ వస్తాయో అనే ఇంట్రెస్ట్ ని ఆడియన్స్ కు కలిగేటట్టు చేసింది.
ఆర్య లాంటి ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ తర్వాత దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘జగడం’. నిజానికి ఈ సినిమాలో కూడా హీరోగా అల్లు అర్జున్ నటించాలి. ఆర్య గ్రాండ్ సక్సెస్ తర్వాత మరో సినిమా కలిసి చేద్దామని ఫిక్స్ అయ్యారు ఇద్దరూ. ఐతే సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో హీరో అల్లు అర్జున్ కథ తయారయ్యే సమయంలో పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. ఫైనల్ గా కథ రెడీ అయిన తర్వాత జగడం కథ విన్న అల్లు అర్జున్ ఈ కథ నన్ను ఓ మెట్టు పైకి ఎక్కేలా ఉంటుందని అనుకున్నానని, హీరో కారెక్టర్ ని ఇలా చిన్న పిల్లాడి తరహాలో రాస్తావని అనుకోలేదని సుకుమార్ తో అన్నాడట. ఆ మాటకి హర్ట్ అయిన డైరెక్టర్ సుకుమార్ అప్పటికే దేవదాస్ సినిమాతో హిట్ కొట్టిన రామ్ కోసం స్రవంతి రవి కిశోర్ ని కలిసి కథ వినిపించడం, వాళ్ళు ఒకే అనడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ టైం లో అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. జగడం సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడం, ఫైనల్ గా సినిమా అంతా చూసుకున్నాక బన్నీ చెప్పిన మాటే నిజమని సుకుమార్ కి అర్ధం అయ్యింది. ఇక ఆ తర్వాత నుండి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వీళ్ళ మధ్య స్నేహం కొనసాగుతోంది.
ఇక జగడం సినిమా ఐటమ్ సాంగ్ విషయానికొస్తే ’36, 24, 36 ఇవి కొలతలు కాదు ఓరబ్బీ నా ఫోన్ నెంబరు’ అంటూ మరోసారి దేవి శ్రీ ప్రసాద్ హుషారుగా సాగే బీట్ ని కంపోజ్ చేయగా, గీత రచయత సాహితి తన కలం పదును చూపించారు. విలన్ డెన్ లో హీరో గ్యాంగ్ చిందేసే ఈ పాటలో గీత రచయత సాహితి రాసిన కొన్ని లైన్స్ కి సెన్సార్ వారు కత్తెర వేసారు. మళ్ళీ కొత్త లిరిక్ కలిపే టైం లేకపోవడం తో ఆ పదాలని మ్యూట్ చేసి, సినిమాని విడుదల చేసారు. మొదటి సినిమా ‘ఆర్య’ అంత రేంజ్ లో ఈ సాంగ్ సక్సెస్ కాకపోయినా, మిగతా సాంగ్స్ అన్నీ కూడా బాగుండటంతో సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే మ్యూజిక్ పరంగా డిసప్పాయింట్ చేయరనే అభిప్రాయాన్ని బలపరచింది.
బన్నీ – సుక్కు వెరీ స్పెషల్
2007లో జగడం సినిమా విడుదల కాగా 2008లో సుకుమార్ సినిమా చేయలేదు. ఇక తర్వాత తన లక్కీ హీరో బన్నీ తో రెండోసారి ఆర్య-2 సినిమాని 2009 విడుదల చేసారు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే ఒక మ్యూజిక్ సెన్సేషన్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆర్య-2 ఆల్బమ్ లోని అన్ని పాటలు చాట్ బస్టర్స్ గా సంచలనం సృష్టించాయి. ఇక ఆ పాటలకు అల్లు అర్జున్ చేసిన టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోని బెస్ట్ డాన్సర్స్ లో బన్నీ ఒకడిగా అవతరించాడు. మొదటి ఆర్య తో పోలిస్తే ఆర్య-2 కారెక్టర్ పరంగా ఆకట్టుకున్నా ఫుల్ మూవీ అంతగా అలరించలేదు. ఆర్య-2 విడుదల సమయంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా ఉండడంతో ఈ సినిమా ప్రదర్శనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇక ఇందులో ఐటమ్ సాంగ్ ‘రింగా రింగా’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ లో బన్నీ చేసిన టిపికల్ డాన్స్ అతడిలోని ప్రతిభకు అద్దం పట్టింది. ఎంత కష్టతరమైన డాన్స్ మూవ్ మెంట్ అయినా, బన్నీ ఈజీగా చేసే విధానం బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరగడానికి కారణం అయ్యింది. తన ఆర్య సినిమా నుండి మలయాళం ప్రేక్షకులకు కూడా పరిచయమైన అల్లు అర్జున్ ఆర్య-2 తో అక్కడి స్థానిక హీరోలతో సమానంగా మార్కెట్ సృష్టించుకున్నాడు.
ఆర్య-2 తర్వాత డైరెక్టర్ సుకుమార్ హీరో నాగ చైతన్య తో 100% లవ్ సినిమా చేసారు. బయట హీరోలతో గీతా ఆర్ట్స్ సంస్థ మొదటిసారి నిర్మించిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సినిమా థీమ్ తగ్గట్టు బ్యూటిఫుల్ సాంగ్స్ తో ఈ సినిమాని మ్యూజికల్ బ్లాక్ బస్టర్ చేసారు. సుక్కు – దేవి కాంబినేషన్ స్పెషలిటీ కి ఈ సినిమా సాంగ్స్ మరో బెస్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పొచ్చు. ఇక 100% లవ్ లో ఐటమ్ సాంగ్ ‘డియ్యాలో..డియ్యాలో’ కూడా మంచి ఊరమాస్ సాంగ్ గా ఉర్రూతలూపింది. మేఘనా నాయుడు, మరియం జకారియా..హీరో నాగ చైతన్య తో ఈ పాటలో చిందేసారు. చైతన్య సరసన తమన్నా నటించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ లో మిగతా సాంగ్స్ కూడా యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షించాయి.
తన మొదటి సినిమా నుండి విలక్షణ విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ 100% లవ్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాకి దర్శకత్వం వహించారు. సైకాలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు ఇమేజ్ కి భిన్నంగా తెరకెక్కించి, అభిమానులను, కామన్ ఆడియన్స్ ను డైరెక్టర్ సుకుమార్ టోటల్ గా గందరగోళంలో పడేసాడు. ఎన్నో అంచనాలతో థియేటర్ కి వెళ్ళిన అభిమానులకి, ప్రేక్షకులకి ఈ సినిమా ఓ ఫజిల్ లా అనిపించింది. సినిమా దర్శకుడు అంటే, ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇవ్వాలి కానీ, తన పైత్యాన్ని ప్రేక్షకులు, అలాగే అభిమానుల మీద రుద్ధడమేంటి అనీ, ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ పై విమర్శలు వచ్చాయి. ‘వన్ నేనొక్కడినే’ సినిమా పరంగా ఎంత గందరగోళం సృష్టించినా ఆడియో పరంగా మాత్రం మళ్ళీ దేవి శ్రీ ప్రసాద్ ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. అన్నీ పాటలతో పాటు, ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘లండన్ బాబు..లండన్ బాబు’ సీరియస్ కథాగమనంలో భాగంగా వచ్చినా క్యాచీ ట్యూన్ తో మరోసారి ఈ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘వన్ నేనొక్కడినే’ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నా, ఎప్పటినుండో సుకుమార్ తో సినిమా చేయాలని అనుకుంటున్న ఎన్టీఆర్ సుకుమార్ మీద నమ్మకంతో పచ్చజెండా ఊపేసాడు. వీళ్ళిద్దరి ఫస్ట్ కాంబోలో వచ్చిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. రివెంజ్ డ్రామాతో ఫాదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా లో ఎన్టీఆర్ మేక్ ఓవర్ పరంగా మెప్పించినా, మరోసారి సుకుమార్ తన ఫిజిక్స్, మాథ్స్ క్రియేటివిటి తో మరోసారి ఆడియన్స్ ను కన్ఫ్యుజ్ చేసేసాడు. ఈ సినిమా కూడా జస్ట్ ఒకే అనిపించింది. ఇక సాంగ్స్ పరంగా కూడా అప్పటివరకూ డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో వీక్ ఆడియో ఈ సినిమాకే పడింది. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ కథ కాదు, పాటలు అసలే కాదు. ఇంత కాంప్లికేటేడ్ స్టొరీ ని ఆడియన్స్ కి మెప్పించేలా చేయడంలో ఎన్టీఆర్, సుకుమార్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మేక్ ఓవర్ మాత్రం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టే సరైన ప్లేస్ మెంట్ కుదరకపోవడంతో ఎన్టీఆర్ నుండి మంచి డాన్స్ నెంబర్ ఆశించిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు.
జిగేలు..జిగేలు..జిగేలు రాణి
‘వన్’ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఆశించిన విజయాలు దక్కని డైరెక్టర్ సుకుమార్ కి, ఈ రెండు సినిమాల ఫలితాలతో చాలా వరకూ తత్వం బోధపడిందని చెప్పొచ్చు. మనకి నచ్చినట్టుగా సినిమాలు తీయడం కాదని, ఆడియన్స్ కి నచ్చేటట్టు, వాళ్ళకి అర్ధం అయ్యేటట్టు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగిన సుకుమార్ అప్పటివరకూ ఒక్క గ్రామీణ నేపధ్యం సినిమా చేయలేదు. అందుకే తర్వాత హీరో రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కోసం మన మట్టి వాసనలోని గొప్పదనాన్ని చూపించాలని ‘రంగస్థలం’ సినిమాని తెరకెక్కించారు. అప్పటి వరకూ అన్ని మాస్ మసాలా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ ని గోదావరి జిల్లాల కుర్రాడిగా చూపిస్తూ, 1980 ప్రాంతం నేపధ్యాన్ని తీసుకుని ఒక దృశ్య కావ్యంగా రంగస్థలం సినిమాని తెరకెక్కించారు. చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన చరణ్ ఈ సినిమాతో విమర్శకుల నోళ్ళు మూయించి, తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ రంగస్థలం సినిమాలో చూపించాడు. ఇక ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ మరోసారి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఐటమ్ సాంగ్ విషయానికొస్తే ‘జిగేల్ రాణి’ మామూలు ఊపు ఊపలేదు. అప్పట్లో ఎక్కడ విన్నా ఈ పాటే. ఈ టీవీ షో లో చూసినా ఈ సాంగే. చరణ్, పూజ హెగ్డే జంట జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులను ఇరగదీసి ఈ సాంగ్ ని ఆ ఏడాది బెస్ట్ సాంగ్ గా నిలబెట్టారు. ఇక ఆ తర్వాత పుష్పరాజ్ సృష్టించిన ప్రకంపనలు ముందే తెలుసుకున్నారు.
ఈ కథనం పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ కథనాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి.