“Pawan Kalyan: The Political Game Changer in 2024” : సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా కొణిదల పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. సినిమాల్లో హీరోగా నటిస్తున్నప్పుడు సరికొత్త ప్రయోగాలతో, డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో ఎంతోమంది అభిమానాన్ని పొందిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఒక కొత్త మార్గాన్ని క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే పలు శాఖలకు మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రాజకీయ విధానాలు, రాజకీయ ఆలోచనలు ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చా? ఒక నాయకుడు ప్రజల్లో ఇలా కలిసిపోవచ్చా? ప్రజల సమస్యలను ఈ విధంగా పరిష్కరించ వచ్చా.. అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిపాలనను చూసి ప్రతిపక్ష పార్టీ నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2024 సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుత సంవత్సరంగా చెప్పవచ్చు. పడి లేచిన కెరటంలా, ఒక సునామీల పవన్ ప్రభంజనం ఈ సంవత్సరంలో కనిపించింది. మాన్ అఫ్ ది మ్యాచ్ గా రియల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ ని 2024 సంవత్సరం ప్రజల ముందు నిలబెట్టింది.
అన్నంత పని చేసిన..జనసేనాని
జగన్ గుర్తుపెట్టుకో నిన్ను అథ పాతాళానికి తొక్కక పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు.. అంటూ ఎలక్షన్స్ ముందు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ చేసిన సీరియస్ వ్యాఖ్యల్ని విని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగతాళిగా నవ్వారు. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. రాజకీయపరంగా ఏ అవినీతి మరక పవన్ కళ్యాణ్ కి లేకపోవడంతో ఆయన వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తాను శపథం చేసినట్టుగానే అన్నంత పని చేసి అధికార పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుచిత్తుగా ఓడించారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు వైసిపి పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరింది. అంత తక్కువ సీట్లలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఏం చేద్దామనుకుంటున్నాడు? అని విమర్శించిన ప్రతిపక్ష నాయకులకు చుక్కలు కనిపించేలా, 100 కి 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీని విజయపథంలో నడిపించాడు. 100% విజయం సాధించిన పార్టీగా జనసేన పార్టీ జాతీయపరంగా గుర్తింపు పొందింది. వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటా.. ఇది పవన్ కళ్యాణ్ తన కేడర్ కు చెప్పిన మాట. ఎలక్షన్స్ ముందు ఇదంతా అతి విశ్వాసం అని అపహాస్యం చేసిన ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు నిర్ధాంత పోతున్నారు.
ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలుసు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన మార్కు పరిపాలనను అందిస్తున్నా, కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సొంతంగా 134 సీట్లు గెలుచుకున్నా, జనసేన పార్టీ 21 సీట్లు గెలుచుకున్నా 2024 లో జరిగిన పొలిటికల్ వారిలో రియల్ గేమ్ చెంజర్ మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి అంతా కాదు. నిజానికి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి తానే సొంతంగా సింగిల్ గా పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించవచ్చు. ఎవరైనా అలాగే భావిస్తారు కూడా. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటంటే, తన బలం ఎంతో తను పసిగట్టడం. తెలుగుదేశానికి, భారతీయ జనతా పార్టీకి మధ్య అంతగా సఖ్యత లేకపోవడంతో పవన్ కళ్యాణ్ తానే తగ్గి చాలా నియోజకవర్గాల్లో సీట్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. ఎవరికివారు సింగిల్ గా వస్తే అది వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారుతుంది అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి కట్టాల్సిందే అని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ని పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడే తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల సమరంలో పాల్గొంటాయని ప్రకటించారు. ఆరోజు పవన్ కళ్యాణ్ చేసిన ఆ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కొత్త మలుపు తిప్పి తిప్పాయి.
వంద శాతం విజయం
నిజానికి జనసేన పార్టీకి 50 వరకు సీట్లు ఇస్తారని, 50 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని కూటమి పొత్తు కుదిరినాక అందరూ భావించారు. అటు బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు ఏ విధంగానూ చెడిపోకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ తానే తగ్గి ఫైనల్ గా 21 సీట్లలో పోటీ చేశారు. అంత అన్నాడు.. ఎంత అన్నాడు చివరికి ముష్టి 21 సీట్లలో పోటీ చేస్తున్నాడు అని ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా, అలాగే సొంత పార్టీలోనే నాయకులు అసహనం ప్రదర్శించినా పవన్ కళ్యాణ్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాడు. తన పార్టీకి దాదాపు 30 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నా సర్దుకుని కూటమి రథసారథిగా అన్ని తానై ఎన్నికల సమరంలో, తనదైన రాజకీయ ఉపన్యాసాలతో కూటమి ఉద్దేశ్యం బలంగా జనాల్లోకి వెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. మండు వేసవిలో అలుపెరుగని పర్యటనలు చేసారు. తన పార్టీ పోటి చేస్తోన్న స్థానాల్లోనే కాకుండా చంద్రబాబు తో కలిసి అన్ని నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసారు. 21 సీట్లే అని ఎగతాళి చేసిన వారికి 21 స్థానంలోనూ, పోటి చేసిన రెండు ఎంపి స్థానాలు గెలిచి సరికొత్త రాజకీయ చరిత్రను 2024వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ లిఖించారు.
రీల్ హీరోనే కాదు..రియల్ హీరో కూడా
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొణిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త రాజకీయ ఒరవడికి స్వాగతం పలికారు. సినిమా హీరోగా ఎంతో పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్, రాజకీయ నాయకుడుగాను ఎక్కడికి వెళ్లినా జనాల నీరాజనాలు అందుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆయన కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. మొదటి మూడు నెలల కాలంలో పరిపాలనపై అధికారులతో వరస సమీక్షలు నిర్వహిస్తూ మంచి అవగాహన పెంచుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని ఒక సినిమా హీరో గానే చూసిన ప్రభుత్వ అధికారులు ఆయనతో ప్రత్యక్ష భేటీల తర్వాత ఆయన ఆలోచనలను, ఆశయాలను తెలుసుకుని పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి శాఖలోని అధికారులు ఆయన నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తూ ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.
పొలిటికల్ ట్రెండ్ సెట్టర్
అధికారం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా తమ సొంత నిధులను విపత్తులకు విరాళంగా ప్రకటించిన దాఖలు ఇప్పటి వరకూ ఎక్కడా లేవు. కానీ రాజకీయ నాయకులందు పవన్ కళ్యాణ్ వేరయా.. అన్నట్టుగా విజయవాడలో ముంచెత్తిన వరదలకు 6 కోట్ల సొంత నిధులను పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించి రాజకీయ నాయకులు అందరికీ షాక్ ఇచ్చారని చెప్పాలి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే తెలంగాణ వరద బాధితులకు కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఎప్పుడు జనాల సొమ్మునే తినేసే రాజకీయ నాయకులను చూసిన జనాలకు పవన్ చేస్తున్న ఈ కొత్త రాజకీయం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.
సేనాని.. సనాతన సారధి
“Pawan Kalyan: The Political Game Changer in 2024”
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ఆయనకు జాతీయస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. తిరుమలలో వారాహి డిక్లరేషన్ ప్రకటించి, సనాతన ధర్మంపై తన అభిప్రాయాన్ని సూటిగా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పి పవన్ కళ్యాణ్ జాతీయస్థాయిలో అనేకమందికి అభిమాన రాజకీయ నాయకుడిగా మారిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయినిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తమిళ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించాయి. ఇక మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు అక్కడ స్థానిక తెలుగువారినే కాకుండా స్థానికేతరులను కూడా విపరీతంగా ఆకర్షించాయి. బిజెపికి సపోర్టుగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చి పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గంలోనూ బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పవన్ కళ్యాణ్ పాపులారిటీ మరోసారి ఢిల్లీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పవన్ ను ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఒక యంగ్ పొలిటికల్ లీడర్ గా ప్రజలు చూస్తున్నారు.
2024 పవన్ నామ సంవత్సరం
మొత్తానికి గడిచిన 2024 సంవత్సరాన్ని పవన్ నామ సంవత్సరంగా చెప్పవచ్చు. జనసేన పార్టీ స్థాపించి దాదాపు పది సంవత్సరాలుగా జనం మధ్య తిరుగుతూ ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను, ఒత్తిడిలను పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. ఒక పార్టీ అధినేతగా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే కూటమికి దిశా నిర్దేశం చేసిన నేతగాను ఆయన గుర్తింపు పొందారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ చొరవ తీసుకోకపోతే, కూటమి అనేది సాధ్యమయ్యేది కాదు. కూటమిలో కూడా ఎటువంటి లోపాలు, సమస్యలు లేకుండా చూసుకొని మూడు పార్టీల నాయకుల్ని సమన్వయం చేసే బాధ్యతను కూడా ఆయన అత్యంత నిజాయితీగా, నిష్కల్మషంగా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయి, పరాజయం పొందడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. జనాలకు ఏదో చేయాలి అనే తపన కలిగిన నేతగా పవన్ కళ్యాణ్ ను జనాలు నమ్మారు. దాదాపు పది సంవత్సరాలుగా అధికారం కోసం చూస్తున్న పవన్ కళ్యాణ్ కు తిరుగులేని మెజార్టీతో విజయాన్ని అందించారు. ఎన్నికలకు ముందు ఒక ఎమోషనల్ పవన్ కళ్యాణ్ చూసిన ప్రజలు ,రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడిగా పవన్ ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మరింత అత్యున్నత స్థాయికి వెళ్తాడని, ఆయనకి ఆ అర్హత ఉందని తలపండిన రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.