Game Changer Pre-Release Event Hilights : మరో ఐదు రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా వరల్డ్ వైడ్ సందడి చేయడానికి ముస్తాబవుతున్నాడు.గేమ్ చేంజర్ సినిమా విడుదల దగ్గుపడుతున్న కొద్ది చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాదులో ఎస్ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా చిత్ర ట్రైలర్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముంబైలో చిత్ర యూనిట్ మరో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. మొదట తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. కన్నడంలోనూ, మలయాళం లోనూ కూడా విడుదల చేయాలని ఒత్తిడి రావడంతో చివరి నిమిషంలో కన్నడ, మలయాళం వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారు. దాంతో చిత్ర యూనిట్ క్షణం తీరిక లేకుండా గేమ్ చేంజర్ సినిమా కోసం కష్టపడుతోంది. ఇక చిత్రానికి సంబంధించి ఫైనల్ మెగా ఈవెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వేదికైంది. మెగా అభిమానుల సమక్షంలో 2024వ సంవత్సరంలో రియల్ పొలిటికల్ గేమ్ చేంజర్ అయిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ హైలెట్ గా సాగిన గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ వేడుక విశేషాలు మీకోసం…
Game Changer Pre-Release Event Hilights
హైలెట్స్ అఫ్ ఈవెంట్
- ఈ కార్యక్రమంలో జనసేన జెండాలు పట్టుకుని మెగా అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా సౌండ్ స్పీకర్స్ సెటప్ పై అభిమానులు భారీగా ఎక్కి హంగామా సృష్టించడంతో, యాంకర్ సుమ పలుమార్లు వాళ్లను దిగమని రిక్వెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఈ ఈవెంట్ కోసం ఏర్పాటు చేశారు. అయినా గానీ కొంతమంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడంతో వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని చిత్రంలో పనిచేసిన నటీనటులు చిన్న చిన్న స్పీచ్ తో సరిపెట్టారు.
- విలన్ గా ప్రధాన పాత్ర పోషించిన ఎస్ సూర్య స్టేజ్ పై తడబడుతూ మాట్లాడారు. సూర్య మాట్లాడుతున్నప్పుడు వెనక స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ విజువల్స్ ని వస్తుండడంతో అభిమానుల నినాదాలు ఎక్కువయ్యాయి. దాంతో కొంచెం కంగారుపడిన ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కూడా దేశభక్తి ఎక్కువని, ఖుషి సినిమాలో ఏ మేరా జహా సాంగ్ గురించి చెప్పబోతూ తనకు తెలుగు అంత స్పీడ్ గా రాదు కాబట్టి కొంచెం కంగారు పడ్డారు. ఇక తర్వాత మాట్లాడదామనే ఉద్దేశంతో తన స్పీచ్ ని అందరికీ విషెస్ చెబుతూ త్వరగా ముగించారు.
- దర్శకుడు శంకర్ కూడా ఈ ఈవెంట్లో చాలా వివరంగా మాట్లాడాలని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. అక్కడికి వచ్చిన భారీ జన సందోహాన్ని చూసిన తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరుగుతుందేమో అనే కంగారు ఆయనలో ముఖంలో కనిపించింది. ఆయన కూడా తన స్పీచ్ ను త్వరగా ముగించారు.
- వేడుక ప్రారంభంలో ఇప్పటివరకు గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వని రెండు పాటలను సంగీత దర్శకుడు తమన్ తన టీం తో కలిసి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు పాటల విషయంలో కొంచెం అటు ఇటు ఉన్న ఈ చిత్రానికి, ఈ రెండు పాటలతో మరింత నిండుతనం వచ్చింది. ముఖ్యంగా సోల్ ఆఫ్ గేమ్ చేంజర్ అంటూ తమన్ టీం ఆలపించిన ఓ ఎమోషనల్ సాంగ్ గేమ్ చేంజర్ చిత్రంలోని బలమైన కంటెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ రెండు పాటలు విన్న తర్వాత ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందనే భావన అభిమానులకు, ప్రేక్షకులకు కలిగింది.
- హీరో రామ్ చరణ్ కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు. రాజమండ్రిలో ఈ భారీ జన సందోహాన్ని చూస్తుంటే, ఇంతకుముందు జనసేనాని పవన్ కళ్యాణ్ ధవలేశ్వరం బ్రిడ్జిపై నిర్వహించిన భారీ ర్యాలీ గుర్తుకొస్తుందని అన్నారు. మేమంతా తెరమీద ఏం చేసినా, రియల్ పొలిటికల్ గేమ్ చేంజర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, ఆయన్ని చూసే ఇలాంటి నిజాయితీగల క్యారెక్టర్స్ ను దర్శకుడు శంకర్ సృష్టించాడని చరణ్ అన్నారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలోనూ రియల్ గేమ్ చేంజర్ గా కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ పక్కన నిలబడటం తన అదృష్టమని, తాను ఆ ఫ్యామిలీలో భాగమవడం, ఆయనతో పాటు తాను ఈకాలంలో ఉండడమనేది గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నానని.. చరణ్ అన్నారు. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలి అని ఉన్నా, తర్వాత మాట్లాడుతానని తాను కూడా పవన్ కళ్యాణ్ మాటలను వినాలి అనుకుంటున్నానని, మైకు ఇచ్చేస్తూ పవన్ కళ్యాణ్ పాదాలకు నమస్కారం చేశారు.
- దర్శకుడు శంకర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడం కోసం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో ఆయన రిసీవ్ చేసుకున్న తీరు, మర్యాద నన్ను ఎంతగానో ఆకట్టుకుందని, ఆయన ఇంగ్లీష్ తనని ఎంతగానో ఇంప్రెస్ చేసిందని, అందరి హృదయాల్లో గెలుచుకోవడంలో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడనీ, దర్శకుడు శంకర్ పవన్ ని కొనియాడారు.
ఎందరో మహానుభావులు..అందరికి వందనాలు
ఇక ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ : రఘుపతి వెంకయ్య గారిని మర్చిపోలేము.. ఒక దాదాసాహెబ్ ఫాల్కే ని మర్చిపోలేం..ఒక సత్యజిత్ రే ని మర్చిపోలేం.. షోలే ని తీసిన సిప్పిలను మర్చిపోలేం. తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం..బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేము’ గూడవల్లి రామ బ్రహ్మంగారిని మర్చిపోలేము. ఈ రోజున ఈ వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాణాతులు, హానుభావులు ఉన్నారు. సూర్య గారు లాంటి నటుడు, దర్శకులు ఉన్నారంటే మన మూలాలు మర్చిపోకూడదు. తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారిని మనస్పూర్తిగా గుండె లోతుల్లోంచి స్మరించుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రాంచరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నాగాని దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎక్కడో మారుమూల ఓ చిన్న పల్లెటూరు మొగల్తూరు గ్రామంలో పుట్టి ఆయన ఈ స్థాయికి రావడమే కాకుండా మమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడకి కదిలింది వచ్చింది అంటే ఒక అక్కినేని నాగేశ్వరావు గారు, రామారావు గారు ఘట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తి యుక్తులు ధారబోసారు. వారందరికీ ఒక నటుడుగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా మనస్పూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఒకే ఒక్క సినిమా..అది భారతీయ సినిమా
ఈ రోజున ఇంత బలంగా ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం సహకారం వలనే. అనుభవ నాయకులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆయన ఆశీస్సులు, ఆయన సహకారం ఆయన నిరంతరం మద్దతు ఈ రోజు ఎక్కడ ఇంత అద్భుతమైన సభ జరుగుతోంది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిజిల్లా పోలీస్ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. 90 దశకం లోనే పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడు శంకర్ ఇప్పటి పాన్ ఇండియా దర్శకులకు, హీరోలకు ప్రేరణగా నిలిచారు. భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ, రాజమౌళి గారు గాని, జూనియర్ ఎన్టీఆర్ గానీ వీరందరూ ఇంతటి ఖ్యాతి పొందారంటే దానికి మూలం దర్శకుడు శంకర్. టాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ అని కాదు భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం హాలీవుడ్ను అనుకరించడం మానేసి మన సొంత కథలతో మన జాతి ప్రాముఖ్యతను సినిమా ద్వారా ప్రపంచానికి చూపించాలి. డబ్బులు సంపాదించడమే సినిమాల ధ్యేయం కాదు. సినిమాలు మంచి విలువలు నేర్పాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపజేసే బాధ్యతతో సినిమాలు తీయాలి.
అందరి సినిమాలు ఆడాలి
Game Changer Pre-Release Event Hilights
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఏ హీరో ఉన్న దానికి మూలం చిరంజీవి. మీరు గేమ్ చేంజర్, ఓ జి, డిప్యూటీ సీఎం ఏదైనా అనొచ్చు దానికి అంతటికి మూల కారణం చిరంజీవి. ఆయన నాకు అన్నయ్య కాదు. పితృ సమానులు మా వదిన తల్లితో సమానం. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను. ఆ రోజుల్లో అన్నయ్య ఒకడు నిలబడి పెరిగి పెద్దవాడై మా అందరికీ ఆశ్రయమిచ్చాడు. ఊతమిచ్చాడు ఆయన ఇచ్చిన ఊతం వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. అందరూ వెళ్లడానికి భయపడే మారుమూల గ్రామాలకు ఈరోజు నేను ఒంటరిగా ఎలాంటి భయం లేకుండా వెళ్లి, అక్కడ ఈ పరిస్థితులు గమనించి రోడ్లు వేయగలుగుతున్నానంటే దానికి ధైర్యం మా అన్న ఇచ్చిందే. మేము ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందరి సినిమాలు బాగా ఆడాలి అని అనుకుంటాం. ఏ హీరో కూడా పాడైపోవాలని కోరుకునే సంస్కృతి మా కుటుంబంలో లేదు. టికెట్ ధరల పెంపు అనేది డిమాండ్ సప్లై సూత్రం ఆధారంగా ఉంటుంది. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ మూవీని అప్పట్లో నేను బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశాను. అలా టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరే వాళ్ళ జేబు లోకి వెళ్తుంది. అదే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది.
తండ్రి మెగాస్టార్..కొడుకు గ్లోబల్ స్టార్
రామ్ చరణ్ పుట్టే సమయానికి నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి హనుమంతుడు. ఎంత ఎదిగిన ఎంత శక్తివంతుడైన ఆయన ఎదిగి ఉండాలనే సందేశాన్ని మానవాళికి అందించారు. అందుకే నా తండ్రి రామ్ చరణ్ కి ఆ పేరు పెట్టారు. బాగా చిన్నప్పుడే అంటే ఏడేళ్ల వయసులోనే తెల్లవారుజామునే లేచి రామ్ చరణ్ హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. అంతటి ప్రతిభా సమర్థత అతనికి ఉన్నాయని మగధీర సినిమా వచ్చేవరకూ తెలియదు. సుకుమార్ తీసిన రంగస్థలం సినిమా చూసి రామ్ చరణ్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. మిస్ అయ్యింది. తను చిన్నప్పటి నుండి కూడా పల్లెటూర్లలో గాని, గోదావరి జిల్లాలో గాని పెరగకపోయినా ఒక గోదావరి జిల్లా కుర్రాడుగా ఆ సినిమాలో అద్భుతమైన నటనని రామ్ చరణ్ ప్రదర్శించాడు. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు తండ్రిలా కాకపోతే మరి ఎలా ఉంటాడు తండ్రి మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్. ఈ గేమ్ చేంజర్ సినిమాతో అవార్డు రావాలని కోరుకుంటున్నాను’ ఇవీ పవన్ స్పీచ్ ముఖ్యాంశాలు.