చిరంజీవి అంటే డాన్సు. డాన్స్ అంటే చిరంజీవి | Chiranjeevi honoured with Guinness World Record | 2024 : అది 1992 మే నెల మొదటివారం. అప్పటికే ఘరానామొగుడు(Gharana Mogudu) సినిమా విడుదలై నెల రోజులు దాటేసింది. మా కాకినాడ పద్మప్రియ థియేటర్ దగ్గర మాత్రం బ్లాక్ టికెట్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ మొదటి రెండు వారాలు వంతెన దగ్గర ఉన్న స్వప్న థియేటర్ లో కూడా ఆడింది ఘరానామొగుడు సినిమా. అయినా, కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు..ఎలా తగ్గుతాయి చూసిన వాళ్ళే మళ్ళి మళ్లి చూస్తుంటే. ఇక ఫాన్స్ సంగతి చెప్పనక్కర లేదు. రోజుకి రెండు మూడు షోస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సెలవురోజు కావడంతో రెండోసారి చూద్దామని మా ఫ్రెండ్, నేనూ ఉదయం ఆటకి పద్మప్రియ థియేటర్ కి వెళ్ళాము. అప్పటికే చాలా లేట్ అయ్యింది. లోపల సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. హాల్లో సినిమా సౌండ్స్ బయటకి వినపడుతున్నాయి. ‘హాలు నిండినది’ బోర్డు గేటుకు వేలాడుతూ కనిపించింది.
రిలీజ్ రోజు చిరంజీవి సినిమా టికెట్ దొరికితే..లక్ష రూపాయలు లాటరీ కొట్టినట్టే …
బయట ఇంకా బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నారు. గబ గభా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాము. 2.50 (రెండు రూపాయల 50 పైసలు) టికెట్ 10 రూపాయలు అంటున్నాడు. కొంచెం పక్కకు నిలబడి ఏం చేద్దాం, అని తర్జన భర్జన పడుతుంటే మావోడు మాత్రం చెవులు రిక్కిరించి హాల్లో సౌండ్స్ వింటున్నాడు. ‘బాబు రెండే ఉన్నాయ్ రావాలి’ అంటూ కంగారు పెడుతున్నాడు.. బ్లాక్ టికెట్స్ వాడు. ఇంతలో మావోడు ఫస్ట్ సాంగ్ అయిపోయిందా? అని అడిగాడు. లేదు ఇప్పుడే మొదలయ్యింది పేర్లు పడుతున్నాయి అన్నాడు వాడు. మావోడు వాడివైపు అనుమానంగా చూసాడు. బాబు రండి ఓ ఐదు రూపాయలు తగ్గించి ఇవ్వండి అన్నాడు నాతో. పదరా తీసుకుందాం అన్నాను… నేను హుషారుగా. వద్దు రా అంటూ చేయిపట్టుకుని దూరంగా లాక్కొచ్చాడు మావోడు. ఏమైందిరా డబ్బులు సరిపోతాయ్ కదా అన్నాను.. కొంచెం చిరాగ్గా. ఫస్ట్ సాంగ్ అయిపోయిందిరా (Bangaru Kodipetta Song) ఆడు (బ్లాక్ టికెట్స్ ) మనల్ని ఎర్రి పువ్వుల్ని చేస్తున్నాడు అన్నాడు. ఫస్ట్ సాంగ్ అయిపోయిందా అయితే వేస్ట్ అనుకుంటూ అయినా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవ్ అన్నా మావోడితో. అరేయ్ ఇప్పటకి 5 సార్లు చూసా..స్వప్నలో రెండు సార్లు ఇక్కడ మూడు సార్లు. లోపల రావు గోపాలరావుని రౌడీలు రోడ్డు మీద కొట్టే సీను వస్తుంది. రా.. ఆనంద్ లో ఏదైనా ఉంటే చూసేసి పోదాం అంటూ ముందుకి పరిగెత్తాడు మావోడు. వెనకే నేను.
అట్లుంటది మరి చిరంజీవితోటి. చిరంజీవి అంటే డాన్సు. డాన్స్ అంటే చిరంజీవి. థియేటర్ లో చిరంజీచి డాన్స్(Dance) మిస్ అయితే టికెట్ ఖర్చు వేస్ట్. చిరంజీవి డాన్సులు లేని తెలుగు సినిమాని ఊహించగలమా. చిరంజీవి సినిమాల్లోకి రాని రోజుల్లో ఆడియన్స్ సినిమాలో పాట వస్తే హాల్లోంచి బయటకు సిగరెట్, లేదా టీ తాగడానికి వచ్చేవారు. సినిమాలో ఏదైనా పాట వస్తే చూసే సాంగా..సిగరెట్ సాంగా అనేవారు. చిరంజీవి రాకతో అవి మారాయి. చిరంజీవి సినిమాలో పాట మొదలైతే కళ్ళు రెండూ తెరపైనే . చిరంజీవి పక్కన ఎంత అందమైన హీరోయిన్ వున్నా, హాల్లోని ప్రేక్షకుల దృష్టి మాత్రం చిరంజీవి పైనే. అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే …బిఫోర్ చిరంజీవి ఆఫ్టర్ చిరంజీవి అనే రేఖ ఎప్పటికీ చెరగదు.
నువ్వేమైనా చిరంజీవా?
అప్పటి వరకూ పాసింజర్ ట్రైన్ లా వెళ్తోన్న తెలుగు సినిమా వేగాన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా పరుగులు పెట్టించాడు చిరంజీవి. తన గ్రేస్ తో, తన బాడీ లాంగ్వేజ్ తో, తన మానరిజమ్స్ తో డాన్స్ కే డాన్స్ అంటే ఏంటో చెప్పాడు చిరంజీవి. మెలికలు తిరిగిపోయే బ్రేక్ డాన్స్ అయినా, ఊర మాస్ సాంగ్ అయినా, మెల్లగా ఉన్న మెలోడీ సాంగ్ అయినా, రంజుగా ఉండే రొమాంటిక్ సాంగ్ అయినా…పాట ఏదైనా సరే, తన మెస్మరైసింగ్ డాన్స్ తో, హావభావాలతో హాల్లో ప్రేక్షకుల్ని కట్టిపడేయటం చిరంజీవికి మాత్రమే తెలిసిన విధ్య. అది ఆయన వరం. అందరు హీరోలు డాన్సులు చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. అందరు హీరోలూ చాలా బాగా చేస్తారు. కానీ, చిరంజీవిలా మాత్రం… చిరంజీవే చేస్తాడు. ఇప్పటికీ చిరంజీవి గ్రేస్ ని, డాన్సు లో ఆయన స్టైల్ ని కనీసం మాచ్ చేసే హీరో లేడంటే చిరంజీవి తెలుగు వాళ్ళ హృదయాలలో వేసిన ముద్ర ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు. సినిమా అంతగా బాలేకపోయిన కేవలం చిరంజీవి డాన్సుల కోసం ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి…అప్పట్లో.
చిరంజీవి అంటే డాన్సు. డాన్స్ అంటే చిరంజీవి | Chiranjeevi honoured with Guinness World Record |
నాట్యం అనేది చిరంజీవి(chiranjeevi)లో అణువణువునా ఉంది. అందుకే చిరంజీవి నడిస్తే స్టైల్..నిలబడి అలా కెమెరా లోకి చూస్తూ కన్ను గీటితే ఒక స్టైల్. తన అద్బుతమైన నటనా సామర్ధ్యంతో, డాన్సింగ్ స్కిల్స్ తో సినిమాలకి భారీ విజయాల్ని, నిర్మాతలకి కాసుల వర్షాన్ని కురిపించారు చిరంజీవి. ఒక కమల్ హాసన్ ఒక రజనీకాంత్ కలిస్తే …చిరంజీవి అని లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ అన్నారు. ఇంతకంటే అవార్డు రివార్డ్ చిరంజీవికి అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని తన పయనంలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగారు చిరంజీవి. ఒక సామాన్య వ్యక్తి గా ప్రారంభమైన ఆయన ఎప్పటికీ ఓ సమ్మోహన శక్తి. తన కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న చిరంజీవి కీర్తి కిరీటంలోకి గిన్నిస్ బుక్ రికార్డు రూపంలో మరో కలికితురాయి చేరింది. డాన్సులతో అలరించిన మొట్ట మొదటి నటుడిగా చిరంజీవి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ (guinness world record) ఆయన్ని వెతుక్కుంటూ ఆయన ముందు వాలాయి. 156 సినిమాల్లో.. 537 పాటల్లో , 24000 డాన్స్ మూవ్ మెంట్స్…ఈ 45 సంవత్సరాల కాలంలో ఆయన చేసినట్టుగా ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది. చిరంజీవి కెరీర్లో ఇది ఒక మరపురాని అవార్డు ప్రపంచ రికార్డు అని చెప్పాలి. ఆకాశంలో తారలెన్ని ఉన్నా..మిళమిళా మెరిసేవి కొన్నే ..సినీ వినీలాకాశంలో స్టార్ లు ఎందరున్నా..మెగాస్టార్ ఒక్కడే. చిరంజీవి ఎప్పటికీ…చిrunజీవే. ఈ సందర్భంగా trendingnewstelugu.com తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు.
మెగాస్టార్ తో హరీష్ శంకర్ : ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా ? Megastar Chiranjeevi – Director Harish Shankar Combo Movie: మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ తో ‘షాక్’ తిన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పట్లో మీడియా ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ కి ముందు పలు మీడియా సమావేశాల్లో ఆ సినిమాకి భయకరమైన హైప్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసారు. హరీష్ శంకర్ కాన్ఫిడెన్సు చూసి ఆ సినిమా మినిమం అయినా ఉంటుందని థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ కి పెద్ద షాకే తగిలింది. మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ కథ కథనాల మీద పెట్టలేదని బోలెడన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మరో ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టేది. అయితే ఒక సినిమా పరాజయంతో ఒక దర్శకుడి పని తీరును, ప్రతిభను తక్కువగా అంచనా వేయలేం. డైరెక్టర్ హరీష్ శంకర్ టాలెంటెడ్ డైరెక్టర్. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడగల ప్రతిభావంతుడు. పవన్ కళ్యాణ్ సినిమా షూట్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి, కేవలం 20% షూట్ మాత్రమే ఇప్పటివరకూ జరిగింది కాబట్టి, ఈ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ సినిమాకి జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ తో హరీష్ శంకర్ కొన్ని రోజులు మీడియా ని ఫేస్ చేయరు అనుకున్నారంతా. కానీ గబ్బర్ సింగ్ మూవీని రి రిలీజ్ చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రెస్మీట్ లో మిస్టర్ బచ్చన్ ఫలితం పై ఎవ్వరూ హరీష్ శంకర్ ను ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టలేదు. బహుశా అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు అనుకున్నారేమో. గబ్బర్ సింగ్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు హరీష్. ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి తో ఒక ఏడ్ కి దర్శకత్వం వహించిన హరీష్ ను చిరంజీవి గారితో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగారు పాత్రికేయులు. దానికి కాలమే సమాధానం చెప్పాలని, మిరపకాయ్ సినిమా తర్వాత వేరే సినిమా కోసం వెళ్తున్న తనకి పవన్ కళ్యాణ్ నుండి ఫోన్ వచ్చిందని, అప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చేయమన్నారని, అలాగే అన్నీసహకరిస్తే చిరంజీవి గారి సినిమా కూడా ఒకే అవుతుందని నేచర్ కాన్సెప్ట్ చెప్పారు హరీష్ శంకర్.
మెగాస్టార్ తో హరీష్ శంకర్ సినిమా సెట్ అవుతుందా, సెట్ అయితే వర్కౌట్ అవుతుందా ?
100% సెట్ అయ్యే అవకాశాలు వున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పడు యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజకీయాలకు పర్మినెంట్ గా గుడ్ బై చెప్పేసి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఖైదీ నెంబర్ 150 తో తిరిగి ప్రేక్షాభిమానులను పలకరించారు. దాదాపు 8 సంవత్సరాలకు పైగా సినిమాలకు విరామం ఇచ్చిన చిరంజీవి ఆ సినిమాతో తనలోని వాడి, వేడి ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. మరలా చిరంజీవి డాన్స్ స్క్రీన్ పై చూడగలమా అని మాధనపడుతున్న అభిమానులకు ఖైదీ నెంబర్ 150 లోని తన డాన్స్ లతో ఐ ఫీస్ట్ అందించారు మెగాస్టార్. ఆడియన్స్ పల్స్ ని పర్ఫెక్ట్ గా అంచనా వేసే ఆయన రీ ఎంట్రీ తర్వాత ఫిల్మ్ మేకింగ్ లో వచ్చిన మార్పులను, లేటెస్ట్ టెక్నాలజీ, ట్రెండ్ ఎలా ఉంది అనే విషయాల్లో వెంటనే అప్డేట్ అయ్యారు. అందుకే తన రీ ఎంట్రీ సినిమాకి ఆల్రెడీ తనతో పనిచేసిన అనుభవం ఉన్న వి.వి వినాయక్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు. అలాగే మరీ కొత్త కథతో రిస్క్ ఎందుకని అప్పటికే తమిళ్ లో సూపర్ హిట్ అయిన విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా రీ మేక్ రైట్స్ తీసుకుని కొణిదల ప్రొడక్షన్స్ సంస్థ తొలి సినిమాగా ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని తనయుడు రాంచరణ్ నిర్మాణంలో చేసారు చిరంజీవి. ఆ సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న ఆయన కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే తనని మరింత కొత్తగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తారని గ్రహించారు. అందుకే అప్పటికే ఎన్నాళ్ళనుండో చేయాలనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని యంగ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి కి ‘సైరా’ రూపంలో అప్పగించారు.
మెగాస్టార్ తో హరీష్ శంకర్ : ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా ? Megastar Chiranjeevi – Director Harish Shankar Combo Movie
బాహుబలి సిరీస్ తర్వాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా బిజినెస్ బౌండరీస్ చెరిపేశారు. సరిగ్గా సినిమా తీయాలేగాని అది ఏ భాషా ప్రేక్షకులకైనా, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తే రికార్డ్ వసూళ్లను రాబట్టవచ్చని నిరూపించారు. అందుకే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టిన ‘సైరా’ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చేయడానికి ధైర్యం చేశారు చిరంజీవి. రకరకాల కారణాల వలన సైరా సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమాకి కొరటాల శివ తో , లూసిఫర్ మళయాళ రీ మేక్ తో తీసిన గాడ్ ఫాదర్ కి యంగ్ డైరెక్టర్ మోహన రాజాతో కలసి పని చేసారు. ఈ రెండు సినిమాలు కూడా చేదు ఫలితాన్నే అందించాయి. అదే ఊపులో దర్శకుడు మెహెర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాని స్టార్ట్ చేసిన చిరు, తన కెరీర్ లోనే అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నారు. చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని కూడా థియేటర్ లోంచి పరుగులు పెట్టించాడు భోళా శంకర్. ఈ సినిమాలో మధ్యలో 2023 సంక్రాంతి పండక్కి వచ్చిన వాల్తేరు వీరయ్య చిరంజీవి మాస్ ఇమేజ్ ని నిలబెట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యంగ్ డైరెక్టర్ బాబి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి లోని కామెడీ టైమింగ్ ని, ఆయన మాస్ ఇమేజ్ ని బాగా డీల్ చేసాడు. ఇందులో రవితేజ కూడా స్పెషల్ రోల్ చేయడంతో సంక్రాంతి విన్నర్ గా వాల్తేరు వీరయ్య చిత్రం మార్కులు కొట్టేసింది. రీమేక్ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడదామని, చిరంజీవి రీమేక్ చేయడానికి ఎంచుకున్న లూసిఫర్, వేదాళం అప్పటికే తెలుగులో డబ్బింగ్ అయ్యి ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయినా గానీ తనకి కొత్తగా ఉంటుందేమో, తనని కొత్తగా చూపిస్తారేమో అనుకున్న చిరంజీవి కి అవి విడుదలై ఫ్లాప్ అయితేనే గానీ విషయం తెలిసిరాలేదు.
ఇకనుండి కొత్త కథలు..కొత్త దర్శకులు
గత నాలుగైదు సంవత్సరాలుగా ott కి బాగా అలవాటు పడ్డ సినిమా లవర్స్ అన్ని భాషల్లోనూ విభిన్న సినిమాలను ఆస్వాదిస్తున్నారు. అందుకే ఇక కొత్త కథలతో, కొత్త దర్శకులతో పని చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు. బింబిసార సినిమాతో ప్రూవ్ చేసుకుని చిరంజీవి తో భారీ సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికొస్తే..ఎన్నోసార్లు చిరంజీవిని సినిమా వేడుకల్లో తనకి అవకాశం ఇవ్వమని డైరెక్ట్ గానే అడిగేసాడు. దానికి చిరంజీవి కూడా నవ్వుతూ ఒకే చెప్పారు. అప్పటికే హరీష్ శంకర్ మదిలో ఒక మాస్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది అని చెప్పారు కాబట్టి కథ ఎలా ఉండాలి అనే విషయంపై ఓ క్లారిటీ కి వచ్చి వుంటారు. పక్కగా రెడీ చేసుకుని చిరంజీవికి వినిపిస్తే, ఆయన సలహాలతో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈమధ్య హరీష్ శంకర్, చిరంజీవి ఒక ఏడ్ కోసం కూడా కలిసి పని చేసారు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన హరీష్ కి ఆయన్ను ఎలా చూపిస్తే అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చుతుందో అలా చూపించి హిట్ కొట్టే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నా కాంబినేషన్ ఇది. ఆ సినిమాని నిర్మించే అవకాశం తనకి రావాలని ఈ సందర్భంగా బండ్ల గణేష్ కూడా చిరంజీవికి విజ్ఞప్తి చేసేసాడు. ఇదంతా జరగాలంటే వీళ్ళిద్దరికీ కాలం కలిసి రావాలి. ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయాన్నికింద కామెంట్ రూపంలో తెలియజేయండి.