దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా ఏ రాష్ట్రంలో లేనన్ని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయి. కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్టుగా ఏపి రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. రాష్ట్రంలో వైసిపి అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గరనుండి ఈ నీచ రాజకీయ సంస్కృతి మరీ ఎక్కువగా తయారయ్యింది. ప్రతిపక్ష పార్టీ ఏదైనా సరే, అధికార పార్టీపై విమర్శలు చేయొచ్చు..ఆరోపణలు చేయొచ్చు.. రాజకీయం చేయొచ్చు కానీ దిగజారుడు రాజకీయాలు చేయకూడదు. ఏ విషయంలోనైనా సంయమనం పాటించాలి. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలి జనాల దృష్టిలో చులకన అవ్వకూడదు. ప్రస్తుతం అధికారం కోల్పోయి అంధకారం లో కొట్టుమిట్టాడుతున్న వైసిపి నేతలు దిగజారుడు రాజకీయాలతో తమ ప్రతిష్టను తామే దిగజార్చుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు కి పబ్లిసిటీ పిచ్చి
ప్రస్తుతం వరద బీభత్సం వలన విజయవాడ ఎంతగా నష్టపోయిందో తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టి, అధికారులను రంగంలోకి దింపి, సహాయ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. స్థానిక కూటమి ఎమెల్యేలు కూడా సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..వరద బాధితులకు ధైర్యం చెప్తూ, సహాయ కార్యక్రమాలను దగ్గరుండి చేయిస్తూ, ఈ వయసులో కూడా ఆయన రాత్రి మూడింటి వరకూ వరద బాధిత ప్రాంతాల్లో పడవపై పర్యటించారు. తెల్లవారుజాము 4 గంటల వరకూ అధికారులతో చర్చించి, కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయిన ఆయన మరలా ఉదయం 7 గంటలకు వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైసిపి వాళ్ళు అంటున్నట్టు..పోనీ చంద్రబాబునాయుడు కి పబ్లిసిటీ పిచ్చి అనుకున్నా మరీ తెల్లవారుజాము 4 గంటల వరకూ పని చేయాల్సిన అవసరం లేదు. అయినా రెండు సార్లు ఉమ్మడి ఎపికి ముఖ్యమంత్రి గా పనిచేసి, ఇప్పడు విభజిత ఆంధ్రప్రదేశ్ కి రెండోసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తోన్న ఆయనకి పబ్లిసిటీ పిచ్చి అంటే, వాళ్ళంతా పిచ్చోళ్ళు మరొకరు ఉండరనే చెప్పాలి.
వరదలో బురద రాజకీయం..
చంద్రబాబునాయుడు పర్యటన తరవాత నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన స్టైల్ పరామర్శ, ఓదార్పు యాత్ర చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. చాలాకాలం తర్వాత హెలికాప్టర్ దిగి, నేల మీదకి వచ్చిన జగన్ ఆ వరదలో బురద రాజకీయం చేయడానికి కారణాలు వెతుక్కున్నారు. చంద్రబాబు అధికారం లో ఉన్నారు కాబట్టి, గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం జరిగింది అని, నెపం వాళ్ళ మీదకి నేట్టేయవచ్చు కానీ అలాంటి కుటిల రాజకీయాలకు దూరంగా, జనాలకు దగ్గరగా ఉన్నారు చంద్రబాబు. ఇకపోతే గత 5 ఏళ్లలో పరదాలు, బారికేట్ల మధ్య పర్యటించిన జగన్ అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడానికి తప్పించి, ఇక దేనికి బయటకి వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక వరద బాధితుల కష్టాలు తెలుసుకున్న జగన్ వరదలపై స్పందించిన తీరు మాత్రం మరీ విడ్డూరంగా ఉంది. మేన్ మేడ్ ఫ్లడ్స్ అని, ఇవ్వన్నీ మనిషి చేసిన తప్పులని, కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు నీట మునగకుండా, అధికారులు గేట్లు ఎత్తేయడం వల్లే ఇదంతా జరిగింది అనీ, ఆయనకు అలవాటు అయిన రీతిలో బురద జల్లే రాజకీయానికి తెరలేపారు. ప్రతిపక్ష నాయకుడు జనాలకి మేలు చేసే విధంగా మాట్లాడాలి..సహాయ కార్యక్రమాలు ఫాస్ట్ గా జరిగేటట్టు చేయాలి. తన పార్టీ తరపున కొంతమంది నాయకులను అక్కడ ఉంచి, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేస్తూ, ఆహారం, నీళ్ళు లాంటి అవసరాలు తీరుస్తూ ధైర్యం చెప్పాలి. ఇక్కడ అవేమి లేవు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు మీదకి తోసేయడం, హమ్మయ్య ఈరోజుకి ఇది అయిపొయింది అనుకుంటూ వెళ్ళిపోవడం జగన్ కు బాగా అలవాటు అయిపోయింది. ఈయన చేసే పనులకు, మాటలకు ఆ పార్టీ అభిమానులంతా తలలు పట్టుకుంటున్నారు. అయినా జగన్ మాత్రం మారరు..మారలేరు. ఎందుకంటే ఆయన జగన్.
పవన్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? ఎన్నికల ముందు ప్రతిపక్షం లేకుండా చేస్తామని బీరాలు పలికిన వైసిపి పార్టీ, ఎన్నికల ఫలితాల తర్వాత అదే ప్రతిపక్ష హోదా కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికి ప్రధానకారణం ఆ పార్టీ ప్రదర్శించిన అతి ఆత్మవిశ్వాసం. ఊర్లలో ఉండే కార్యకర్తల నుంచి, ఎమెల్యే మంత్రులు వరకూ తెలుగు దేశం, జనసేన పార్టీలను చాలా తక్కువ అంచనా వేసారు. కూటమిలో బిజెపి ఎంటర్ అయినాక కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని పీక్స్ కి తీసుకెళ్ళారు. ఇక మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ తాము చేసిన మంచిని చెప్పకుండా, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించకుండా, ఎంతసేపు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ మీద మూకుమ్మడిగా మాటల దాడి చేసారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు, పవన్ తమ ఎన్నికల ప్రచారంలో ధీటుగా సమాదానం చెప్పారు. అయితే కూటమి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన శ్రేణులకు ఊపు తెప్పించింది మాత్రం, పవన్ కళ్యాణ్ ప్రసంగాలే అని చెప్పొచ్చు. వైసిపి పార్టీని అధ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు అంటూ, పవన్ ఆవేశంతో శపధాలు చేసినప్పుడు, అవన్నీ తాటాకు చప్పుళ్ళని లైట్ తీసుకున్నారు వైసిపి నాయకులు. అయితే జనాలు మాత్రం సీరియెస్ గా తీసుకుని 11 సీట్లకే పరిమితం చేయడంతో పవన్ కళ్యాణ్ బలమేమిటో వైసిపి శ్రేణులకి తెలిసొచ్చింది. జగన్ ఇంతటి ఘోర పరాజయం పాలవ్వడానికి పవన్ కూడా ఒక కారణమని ఫలితాల తర్వాత ఒప్పుకున్నా కూడా జనసేన అధినేతని టార్గెట్ చేయడం మానలేదు.
కూటమి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రి తో పాటు, పలు శాఖల మంత్రిగా ఫుల్ బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ తనదైన ఆలోచనలతో, ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అధికార్లు కూడా సమస్యల పట్ల, పాలన పట్ల పవన్ అవగాహన చూసి అచ్చెరువొందుతున్నారు. ఇక చంద్రబాబు, పవన్ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా డబల్ ఇంజన్ సర్కార్ నడుపుతుంటే ఇదంతా చూసి తట్టుకేలేక ఏవేవో అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారు వైసిపి నాయకులు. జగన్ సర్కార్ 2019 అధికారంలోకి వచ్చాక దాదాపు 5 నెలల తర్వాతగాని. సంక్షేమ పధకాలు అమలుకు శ్రీకారం చుట్టలేదు. కొత్తగా ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే కనీసం 6 నెలలైనా వేచి చూడాలి. ఇప్పటికే ఇచ్చిన హామీలు ఎలా చేయాలి అనేదానిపై కసరత్తులు చేస్తూనే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. మరో పక్క వైసిపి నాయకుల అవినీతి కుంభకోణాలు రోజుకు ఒకటి చొప్పున బయట పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి తల్లికి వందనం ఎప్పడు? మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఎప్పడు? అంటూ సమయం ఇవ్వకుండానే కూటమి హామీల గురించి మాట్లాడుతున్నారు పనిలేని వైసిపి నాయకులు. అవన్నీఅమలుచేయడానికి కొంచెం సమయం పడుతుంది. చంద్రబాబు పధకాలు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? విజయవాడలో వరద బాధితులను పవన్ ఎందుకు పరామర్శ చేయలేదు? అంటూ వాళ్ళు చేయాల్సిన పనులను కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక్కటి గమనించాలి, పవన్ కూడా ప్రభుత్వంలో భాగమేనని మర్చిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్, తాను వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని వెళ్లలేదని, అధికారులతో వరద పరిస్థితులపై సమీక్ష చేస్తున్నట్టు తెలియజేసారు.
ఇక ఆ తర్వాత వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రతి వీధిలో కలియతిరుగుతూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తన పార్టీ నాయకులను సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం చేసారు. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు 6 కోట్ల భారీ విరాళం ప్రకటించి అధికారంలో వుండి, సొంత సొమ్మును విరాళంగా ప్రకటించిన నేతగా కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఇందులో కోటి రూపాయలు తెలంగాణా ప్రభుత్వానికి, కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మిగిలిన 4 కోట్లు ఆంధ్రప్రదేశ్ లోని 400 పంచాయితీలకు ఒక్కో దానికి లక్ష రూపాయల చొప్పున ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించిన చెక్కులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందించారు. ఈ విషయంలో అన్ని వర్గాలనుండి పవన్ కళ్యాణ్ కు ప్రసంశలు అందుతున్నాయి. ఏ పదవి లేని సమయంలోనే ఎన్నో విపత్తులకు లక్షలు, కోట్లు సహాయం చేసిన పవన్ ని విమర్శించే మీరు, అధికారంలో ఉండగా ప్రజల గురించి ఆలోచించి ఉంటే వైసిపి నాయకులకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఓట్లు వేసిన ప్రజలు అనుకుంటున్నారు. ఇక పతిపక్షనేత వైయస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలు కేవలం ప్రకటనకు మాత్రమె పరిమితమయ్యింది. ఆయన ప్రకటించడమే కానీ ఎప్పుడు ఇచ్చిన ధాఖలాలు లేవని జగన్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నాయి. దానికి బలం చేకూర్చేలా ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మేము ముఖ్యమంత్రి సహాయనిధి కి ఇవ్వమని, మేమే స్వయంగా వరద బాధితులకు పంచుతామని విలేకరులతో వ్యాఖ్యానించారు.
ఏపీ లో ముగిసిన వరద రాజకీయం. ఏ పార్టీ గెలిచింది ? Which party won the flood politics that ended? Tdp or Ycp |గడిచిన పది, పదిహేనురోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం మహారంజుగా సాగింది. అధికార కూటమి ప్రభుత్వం, విపక్ష వైసిపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కోటలు దాటింది. రాష్ట్రం మొత్తం వరద ప్రభావం వలన నష్టపోయినా, విజయవాడ నగరం మాత్రం ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఇక్కడ బుడమేరు పరిసర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోవడంతో బురద రాజకీయం మొత్తం బుడమేరు చుట్టూ జరిగింది. మొత్తానికి ఇప్పుడిప్పుడే విజయవాడ సాధారణ స్థితికి చేరుకొని ఊపిరి తీసుకుంటోంది. (Vijaywada Floods) ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు అధికార పక్షం, విపక్షం రెండూ రాజకీయాలు చేయడం అనేది సాధారణ విషయమే, అయినప్పటికీ ఈసారి ఆంధ్రా రాజకీయాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పదిరోజుల విపత్కాల సమయంలో ఏ పార్టీ ప్రజల కష్టాలు తీర్చింది? ఏ పార్టీ రాజకీయం చేసింది అనే విషయాన్ని పరిశీలిద్దాం.
సాధారణంగా ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అధికార పార్టీ కంటే ముందే ప్రతిపక్ష పార్టీ పరిస్థితిని తమకి అనుకూలంగా మార్చుకుంటుంది. వెంటనే సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు సహకారం అందిస్తూ అధికార ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తారు. ఇంత విపత్తు వచ్చినా అధికార ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలం అయ్యిందని, బాధితుల ఆకలి కేకలు ఈ ప్రభుత్వానికి వినిపించట్లేదా? అంటూ వాళ్ళ మైలేజి పెంచుకోడానికి తెగ కష్టపడతారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అదే జరిగితే అది ఆంధ్రా ఎందుకవుతుంది? అది విపక్ష వైసిపీ పార్టీ (Ycp Party) ఎందుకవుతుంది?
చంద్రబాబు సమర్ధత
వరద ముంచెత్తిన వెంటనే రంగలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) రాత్రి, పగలు అనే తేడా లేకుండా దాదాపు పది రోజులపాటు జనం మధ్యనే ఉంటూ, జనంలోనే తిరిగుతూ సహాయక కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా, ఆకలి బాధలతో ఎవ్వరూ అలమటించకుండా ఎక్కడికక్కడ అధికారులను ఉరుకులు పెట్టించారు. అంత పెద్ద వయసులోనూ అర్ధరాత్రి వేళల్లోనూ ఆయన పరిసర ప్రాంతాలు మొత్తం కలియ తిరిగుతూ, ఇంటికి వెళ్ళకుండా, కలెక్టర్ ఆఫీస్ లోనే బస చేసి ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం లో భాగమైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Janasena) అధికారంలో వుండి కూడా, తన సొంత సొమ్ముని విరాళంగా ప్రకటించారు. ఆయనతో పాటు జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే టిడిపీ మంత్రి నిమ్మల రామానాయడుతో సహా పలువురు తెలుగుదేశం నేతలు వరద బాధితులకు భరోసా అందించడంలో కూటమి ప్రభుత్వం తరపున ముందున్నారు.
ఏపీ లో ముగిసిన వరద రాజకీయం. ఏ పార్టీ గెలిచింది ?
ఇక తీరిగ్గా రంగంలోకి దిగిన విపక్ష నేత వైఎస్ జగన్, మూడు రోజులపాటు కొన్ని గంటల చొప్పున వరద ప్రాంతాల్లో పర్యటించి, తన మార్క్ బురద రాజకీయాన్ని ప్రదర్శించారు. మేన్ మేడ్ ఫ్లడ్స్ అని, చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా, విజయవాడ మొత్తాన్ని ముంచాడని, మీడియా ముందు తన రాజకీయ అజ్ఞానంతో కావాల్సిన దానికంటే కాస్త ఎక్కవే కామెడీ చేసారు. ఇలాంటి సమయంలో ప్రజలు కోరుకునేది సహాయం. అది ప్రతిపక్షం చేస్తుందా? లేదా ప్రభుత్వం చేస్తుందా? అనేది తర్వాతి విషయం. ఒకవేళ ప్రభుత్వం సరిగ్గా స్పందించక పొతే సమయం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇకపొతే ఎన్నికల సమయంలోనూ, ప్రభుత్వాన్ని ఏదైనా అంశంలో విమర్శించడానికి మీడియా గొట్టాల ముందుకువచ్చి, ఆవేశంతో ఊగిపోయే కృష్ణాజిల్లా వైసిపీ నేతలెవరూ ఈ విపత్కాల సమయంలో విజయవాడలో పొరపాటున కూడా కనిపించలేదు. పార్టీ తరపున బాధితులకు సహాయం చేసినట్టు గానీ, విరాళాలు ప్రకటించినట్టు గానీ ఎక్కడా వినిపించలేదు..కనిపించలేదు. సహాయం చేయకపోగా మరలా ప్రభుత్వం పై విమర్శలు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడని, ఎవరికీ ఏ సహాయం చేయట్లేదని, బాధితులంతా అల్లాడిపోతున్నారని… ఒకటే పస లేని వాగుడు. ఇప్పటివరకూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకి ప్రచార ఆర్భాటం ఎందుకు? అయినా ఇది సోషల్ మీడియా జమానా. ప్రతీ వార్త క్షణాల్లో జనాల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ విషయం విపక్ష నేతలు మర్చిపోతున్నారు. వైఎస్ జగన్ కోటి రూపాయలు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి గానీ, దానికి సంభందించి తర్వాత ఏం జరిగిందో, చెక్ ఎప్పుడు ఇస్తారో ఆయనకే తెలియాలి. ఇక ప్రకాశం బ్యారేజ్ (Praksham Barrage) ని డీ కొట్టిన బోట్ల వ్యవహారం లోనూ వైసిపీ పార్టీ పైనా, ఆ పార్టీ నాయకులపైన తప్పడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి.
వరదలో బురద రాజకీయం…ఇది ఏపిలో మాత్రమే సాధ్యం : Vijayawada Floods 2024
మొత్తానికి ఈ వరద రాజకీయంలో వైసిపీ పార్టీ, అధికార కూటమి ప్రభుత్వం పై బురద జల్లబోయి, తానే బురదలో చిక్కుకుంది. రాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ముందు జగన్ ఎత్తుగడలు ఏమి పనిచేయలేదు. కష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పడు కష్టమొచ్చినా అనుభవం ఉన్న చంద్రబాబునే కోరుకున్నారు. 2014 లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబునాయుడుకే జనం జై కొట్టారు. ఆ ఎన్నికల్లో ఆయనకీ ఘనవిజయం అందించి ఆశీస్సులు అందించారు. 2019 లోనూ చంద్రబాబుని గెలిపించి ఉంటే ఇప్పడు తమకు ఈ కష్టాలు ఉండేవి కాదని, రాజధాని నిర్మాణం, పోలవరం కూడా పూర్తి అయ్యేవని జగన్ పాలన చూసిన తర్వాత జనాలకు బాగా అర్ధం అయ్యింది. అందుకే కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇచ్చి మళ్లి అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు తనకు ఇదే చివరి అవకాశం అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి, ఆయన పేరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోవాలంటే ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి. ఆ దిశగానే చంద్రబాబు అడుగులు పడతాయి..పడుతున్నాయి కూడా. ఇలాంటి కష్ట కాలంలో చంద్రబాబులాంటి అనుభవశీలి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.