బాలీవుడ్ కి దడపుట్టిస్తున్న తెలుగు సినిమా : తన విజయ ప్రస్థానం కొనసాగిస్తుందా? Pan India Telugu Movies 2024-25 : సినిమాల విడుదలకు సంబందించి సంక్రాంతి, సమ్మర్, దసరా అతి పెద్ద సీజన్స్ అని చెప్పాలి. ఈ సమయంలో సినిమాలు విడుదల చేసుకుంటే టాక్ తో పెద్దగా సంబంధం లేకుండా, బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటేసి లాభాలు చూడొచ్చు అనేది మన తెలుగు సినిమా నిర్మాతల నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీజన్స్ లో వచ్చిన ఎన్నో సినిమాలు లాభాలపంట పండించాయి. ఒకప్పుడంటే సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విడుదల తేదీలు ప్రకటించేవారు. ఆ సమయానికి సినిమా సిద్ధమైతే విడుదల చేసేవారు లేకపోతే మరో మంచి డేట్ చూసుకుని తీరిగ్గా విడుదల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. సినిమా రిలీజ్ డేట్ ని సంవత్సరం ముందే లాక్ చేసుకునే పరిస్థితులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా కాలం క్రితమే వచ్చేసాయి. దీనికంతటికి కారణం పోటీతత్వం..పండగ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవాలనే ముందుచూపు అని చెప్పొచ్చు. ఇంతకుముందు హిందీ సినిమాల రిలీజ్ డేట్స్ ఒక సంవత్సరం ముందే ప్రకటించే సంప్రదాయం బాలీవుడ్ లో ఉండేది..హిందీ భాషా చిత్రం కాబట్టి దేశమంతా చూస్తారు కనుక ఏ రాష్ట్రంలోనూ థియేటర్స్ కొరత రాకుండా ఉండాలని, అలా ముందుగానే ప్రకటించి ఆయా తేదీలకు సినిమాలు విడుదల చేసుకుని ఇక్కడా, అలాగే విదేశాల్లో కూడా భారీ లాభాలు కళ్ళ చూసేవారు హిందీ చిత్ర నిర్మాతలు. అందుకే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటేనే హిందీ సినిమా అనుకునేవారు విదేశీయులు. ఇక మన ఖాన్ త్రయం (సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్) కూడా ఇండియన్ సినిమాకి మేమే మహారాజులం అన్నట్టు విదేశాల్లో తమ హంగామా చూపించేవారు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవుగా..ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని మన పెద్దలు ఎప్పుడో చెప్పినట్టుగా ఇప్పడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి మన తెలుగు సినిమా ఎదిగింది. ఏదైనా ఒక క్రేజీ తెలుగు సినిమా విడుదల అవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలతో పాటు, ఇప్పడు ఉత్తరాది రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక హిందీ హీరోలు ఐతే మన సౌత్ సినిమాల పట్ల కాస్తంత అసూయ పడుతున్న మాట వాస్తవమే. ఒకప్పడు తెలుగు సినిమా అంటే సాంబార్ సినిమాలు అని ఎగతాళి చేసినవాళ్ళు ఎప్పడు ఎందుకు కంగారు పడుతున్నారు.
దర్శకబాహుబలి ఎస్ఎస్ రాజమౌళి..
సినిమా పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ చూడని ఈ మార్పుకు కారణం సాంకేతికంగా ఈ మధ్య కాలంలో వచ్చిన పెను మార్పులే. సాంకేతికంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు సినిమాలను విభిన్న కాన్సెప్ట్స్ తో, భారీ హంగులతో తీయడం తెలుగు, తమిళ్ భాషల్లో ఈమధ్య ఎక్కువయ్యింది. ఈ ట్రెండ్ ని పీక్స్ కి తీసుకెళ్ళి తెలుగు సినిమా ఘనతని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మాత్రం దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళిదే అని చెప్పొచ్చు. బాహుబలి సిరీస్ చిత్రాలతో రాజమౌళి అప్పటివరకూ ఏ దర్శకుడు చేయనటువంటి సాహసాన్నిచేసారు. తెలుగు సినిమా మార్కెట్ పరిధిని దాటి, వందల కోట్ల రూపాయల వ్యయంతో బాహుబలి ది బిగిబింగ్, బాహుబలి ది కంక్లుజన్ చిత్రాలను అధ్బుతమైన దృశ్య కావ్యాలుగా అన్ని భాషల ప్రేక్తకుల్ని కట్టిపడేసేలా చిత్రీకరించారు. ఈ రెండు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ప్రమోట్ చేసిన తీరు కాకలు తీరిన వ్యాపారవేత్తలను సైతం మెప్పించింది. సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలతో పాటు, హిందీలోనూ ఈ చిత్రాలకు సరికొత్త మార్కెటింగ్ ఐడియాలతో విపరీతమైన హైప్ ని సృష్టించడంలో వంద శాతం విజయం సాధించారు రాజమౌళి. అంచనాలు సృష్టించడమే కాదు ఆ అంచనాలుకు మించి, సినిమాలో కంటెంట్ తో అబ్బురపరిచారు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ లో పాతుకుపోయిన ఓ ఆనవాయితీని బాహుబలి తన రికార్డుల వేటతో తుదముట్టించాడు. ఇక అప్పటి నుండి మన దర్శక, నిర్మాతలకు ధైర్యం వచ్చేసింది. పవర్ ఫుల్ కంటెంట్ తో, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే హిందీ సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించవచ్చని అర్ధం చేసుకున్నారు. సౌత్ నుండి మొదలైన ఈ ట్రెండ్ తాత్కాలికమే అని బాలీవుడ్ ప్రముఖులు తేలిగ్గా తీసుకున్నారు. ఎప్పటి మాదిగిగానే తమ స్టైల్ మేకింగ్ కథ కథనాలతో సినిమాలు తెరకెక్కించి పరాజయాలు మూటగట్టుకున్నారు. బడా హీరోలా చిత్రాలు సైతం గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా, ఆమధ్య పరాజయం పాలయ్యాయి. దీనికి కారణాలు ఏంటో తలలు పట్టుకుంది బాలీవుడ్.
మారిన ట్రెండ్..మారని బాలీవుడ్
హిందీ సినిమాలకు ఇంతటి గడ్డు పరిస్థితులు రావడానికి మరో ప్రధాన కారణం యూట్యూబ్ అని చెప్పొచ్చు. గత ఆరేడు సంవత్సరాలుగా హిందీ లో డబ్బింగ్ అయిన సౌత్ ఇండియన్ చిత్రాలకు ఉత్తరాదిన అప్పూర్వమైన ఆదరణ లభించింది. మలయాళం, తమిళ్, కన్నడ డబ్బింగ్ సినిమాల కన్నా తెలుగు హీరోలు నటించిన ఎన్నో మాస్ మసాలా మూవీస్ యూట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ తో తెలుగు హీరోలను హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసేసాయి. లాక్ డౌన్ సమయంతో ఈ ట్రెండ్ మరింత ఎక్కువయ్యింది. హిందీ సినిమాలు ఎక్కువగా ప్రేమకథలతో తెరకెక్కుతాయి. ఏక్షన్ సీన్స్ ఉన్నా, ఒక లిప్ లాక్, హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఇలా రొటీన్ గా సాగిపోతున్న హిందీ సినిమా ముందు మన తెలుగు సినిమాలు, మన హీరోల నటనలో కొత్తదనం వారిని బాగా ఆకర్షించింది. పైగా తమిళ్, మలయాళ సినిమాలు ఎవ్వరూ ఊహించని కథ కథనాలతో కట్టిపడేస్తాయి. అందుకే మన భారతీయ కల్చర్ ని ఎక్కువగా చూపించే సౌత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ సినిమా ప్రేమికులు అడిక్ట్ అయిపోయారు. మీరు ఏదైనా ఒక తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ కి వెళ్ళండి. సౌత్ సినిమాలకు ఎంతగా ఆదరణ పెరుగుతుందో మీ అర్ధమవుతుంది.
సౌత్ సినిమా..తగ్గేదే లే..
ఇక 2018 లో కన్నడ చిత్ర రంగం నుండి వచ్చిన కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనమందరం చూశాం. సౌత్ ఇండియాలోనే కాకుండా, హిందీ లోనూ భారీ వసూళ్లు సాధించిన కెజిఎఫ్ చాప్టర్ – 1 తో దక్షిణాది చిత్రాల హవా తాత్కాలికం కాదని, నెమ్మదిగా చాపకింద నీరులా మొత్తం వ్యాపిస్తోందని హిందీ చిత్ర సీమకు తెలిసోచ్చేలా చేసింది. కెజిఎఫ్ చాప్టర్ – 1 లోని కథాకథనాలు, ఎంచుకున్న నేపధ్యం విపరీతంగా ఆకర్షించి, రెండో భాగం కోసం దేశమంతా ఎదురుచూసేలా చేసింది. ఇక బాలీవుడ్ సినిమాలపై తెలుగు సినిమా ఎగురవేసిన మరో విజయకేతనం పుష్ప ది రైజ్. మొదట తెలుగు సినిమాగానే మొదలైన పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా మార్చేసిన ఘనత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దే అని చెప్పాలి. ఆ కథ మీద ఉన్న నమ్మకంతో దర్శకుడు సుకుమార్ వద్దని చెప్పినా, పట్టుబట్టి పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయించి, మన నాలుగు ప్రధాన భాషల్లోనే కాకుండా హిందీ మార్కెట్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అల్లు అర్జున్. అప్పటికే పరిస్థితులు అన్నీ మన సౌత్ సినిమాలకు అనుకూలంగా మారడంతో పుష్పరాజ్ దేశవ్యాప్తంగా అందరికీ భలే నచ్చేసాడు. తగ్గేదేలే.. అంటూ ఐకాన్ స్టార్అ ల్లు అర్జున్ చేసిన మాస్ రచ్చకి, పుష్పరాజ్ బాలీవుడ్ ని సైతం తన అడ్డాగా మర్చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ డిసెంబర్ 6న వస్తోన్న పుష్ప రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ కి దడపుట్టిస్తున్న తెలుగు సినిమా : తన విజయ ప్రస్థానం కొనసాగిస్తుందా? Pan India Telugu Movies 2024-25
ఇక బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం తర్వాత అందరి దృష్టి ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ పైనే. సినిమాపై మీరు ఎన్ని అంచనాలైన పెట్టుకోండి ఆ అంచనాలను ఇంచు కూడా తేడా లేకుండా..అందుకునేలా సినిమాలు తీయడంలో తనకుతానే సాటి అని మరోసారి ఆర్ ఆర్ ఆర్ తో ప్రూవ్ చేసారు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో నిలబెట్టిన ఈ చిత్రం, ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుని తెలుగు సినిమా జెండా ని బాలివుడ్ లో పర్మినెంట్ గా పాతేసింది. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసి హాలీవుడ్ లెజెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఇప్పడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే అనే భ్రమలనుండి అందరూ బయటకి వచ్చారు. ఒక అధ్బుతకళాఖండంగా ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి పనితనానికి జేజేలు పలికారు. ప్రస్తుతం రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆత్రం అంతా ఇంతా కాదు. ఆర్ ఆర్ ఆర్ సంచలన విజయం తర్వాత వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇక్కడ మన సౌత్ లో కంటే, నార్త్ లోనే కెజిఎఫ్ చాప్టర్ 2 పెద్ద విజయం సాధించింది.
ఈ పాన్ ఇండియా సినిమాలు అందించిన విజయాల స్ఫూర్తి ఇప్పుడు అన్ని భాషల చిత్ర పరిశ్రమలపై పెను మార్పులు తీసుకొచ్చింది. ఇక ఎప్పుడైతే ott కల్చర్ ప్రారంభమయ్యిందో ప్రపంచ సినిమా మన ముంగిట్లో వాలినట్టు అయిపోయింది. ఇప్పడు పరిస్థితి ఎలా ఉందంటే సినిమా అంటే సినిమానే.. అది ఏ భాషా చిత్రమో మూవీ లవర్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. అన్ని సినిమాలు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అనువాదం అవుతుండడంతో కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతోన్న గేమ్ చేంజర్, వచ్చే ఏడాది రానున్న ఎన్టీఆర్ వార్ 2, ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ, రామ్ చరణ్ – బుచ్చిబాబు చిత్రం, మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి తొలిసారిగా కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ రాబోయే రోజుల్లో తెలుగు సినిమాని మరో వంద మెట్లు ఎక్కిస్తాయి అనే నమ్మకం అందరిలోనూ కలుగుతోంది. మార్పు అనేది ప్రతీ రంగాలోను సహజమే. సినిమా రంగంలో ఈ ఐదారు సంవత్సరాల్లో వచ్చిన మార్పులు మన తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి తెలియజేసింది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, ఆ సవాళ్ళని తట్టుకుని మన సినిమాలు ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.