తగ్గేదేలే.. అంటూ పుష్పరాజ్ గా, కొత్త రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్ | Pushpa 2 Pre Release Business Create A History : ఒక తెలుగు సినిమా విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు, విదేశాల్లోని తెలుగు వారు ఎదురు చూడటమనేది నిన్నటి మాట. ఒక తెలుగు సినిమా విడుదల కోసం దేశం మొత్తం మీద సినిమా అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూడటం అనేది నేటి సంచలన వార్త. ఈ అరుదైన అధ్బుతమైన ఘనత సాధించింది పుష్ప రాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సరిగ్గా 21 సంవత్సరాల ముందు ఎటువంటి అంచనాలు లేకుండా ఒక సాధరణ కుటుంభ కథా చిత్రంగా వచ్చిన గంగోత్రి సినిమాతో పరిచయమైన అల్లు అర్జున్ తన తొలి సినమాతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. హీరోగా ఎందుకు పనికిరాని ఓ కుర్రోడ్ని తీసుకొచ్చి చిరంజీవి అండదండలతో జనం మీద రుద్దుతున్నారు అనే దారుణమైన విమర్శలనుండి, నేడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా సంచలనం సృష్టించారు అల్లు అర్జున్. ఇప్పడు పుష్ప రాజ్ గా తెలుగు సినిమా సత్తాని ప్రపంచ వ్యాప్తంగా చూపించేందుకు ఈ డిసెంబర్ 5 న బాక్స్ ఆఫీస్ పైకి దూసుకొస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న పుష్ప-2 సినిమాపైనే ఇప్పడు అందరి దృష్టి. ఇంతగా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమేంటి? బిసినెస్ పరంగా ఇప్పటి వరకూ ఏ భారతీయ చిత్రమూ సాధించని రికార్డుల ఘనతని ఒకే ఒక్క పుష్ప రాజ్ ఎలా సాధించాడు? పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎంత పెరిగింది? ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే..
వితౌట్ రాజమౌళి ఇది ఎలా సాధ్యం?
ఇప్పటివరకూ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న మన తెలుగు హీరోలు.. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్. ఈ ముగ్గురూ కూడా మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశమంతా విస్తరించారు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో హీరో ప్రభాస్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో మన తెలుగు సినిమా హీరోలు గొప్పదనం చాటి చెప్పారు. ఇండియన్ సినిమా అంటే..అది హిందీ సినిమానే అనే భ్రమలనుండి బాలీవుడ్ ని బయటకు తీసుకు వచ్చాడు. ఎన్నో ఏళ్ల నుండి నిరాటంకంగా కొనసాగుతున్న ఖాన్ త్రయానికి (అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్) చుక్కలు చూపించాడు. బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించి, సినిమా క్లైమాక్స్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఒక మిలియన్ డాలర్ ప్రశ్న తో బాహుబలి రెండో భాగం పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఆ అంచనాలకు మించి రెండో భాగం తెరకెక్కడంతో బాలీవుడ్ పై తెలుగు సినిమా దండయాత్ర మొదలయ్యింది. ఇక ఆ తర్వాత అంతకుమించి అంచనాలతో, దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ తెలుగు సినిమా హీరోలుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా తమ ప్రతిభను చూపించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా తనకు మాత్రమే సాధ్యమైన అధ్బుత నటనా సామర్ధ్యంతో మెప్పించగా, రామ్ చరణ్ తన నటనా సామర్ధ్యాన్ని పీక్స్ కి తీసుకెళ్ళి హాలీవుడ్ లెజెండరీ దర్శకులతోనూ, నటులతోనూ ప్రశంశలు అందుకున్నారు. ఐతే ఇక్కడ ప్రభాస్ గానీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గానీ పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటడానికి ఒకే ఒక్క బ్యాక్ బోన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తన ప్రతీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ని అబ్బురపరిచే విధంగా తీసే జక్కన్న, తన హీరోలనుండి ది బెస్ట్ తీసుకోవడంలో ఎంత సమయమైన, ఎంత కష్టమైనా అస్సలు రాజీపడరు. ఆ తపన, తెగింపే ఈరోజు తెలుగు సినిమాగానీ, తెలుగు హీరోలుగానీ జాతీయ స్థాయిలో రాణించడానికి కారణమయ్యాయి. అందుకే పాన్ ఇండియా హీరోగా నిలబడాలి అంటే అది రాజమౌళి సినిమాతోనే సాధ్యం అనే నమ్మకం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. అందరు హీరోలు రాజమౌళి తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటే, అల్లు అర్జున్ మాత్రం తన తెగింపు, ధైర్యంతో దర్శకుడు రాజమౌళి అవసరం లేకుండానే పాన్ ఇండియా స్టార్ గా ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పాలి.
అల్లు అర్జున్ – సుకుమార్ ఎప్పడూ ఒక సంచలనమే..
21 సంవత్సరాల అల్లు అర్జున్ సినిమా ప్రయాణంలో తనకి దొరికిన దర్శక ఆణిముత్యం ఎవరైనా ఉన్నారు అంటే..అది దర్శకుడు సుకుమార్ అని చెప్పాలి. హీరోగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్ ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలయ్యింది అని చెప్పాలి. తన మొదటి సినిమా గంగోత్రి తర్వాత, ఆ సినిమాలో తన లుక్ పరంగా వచ్చిన విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలి? తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే కన్ఫ్యూషన్ లో ఉన్న అల్లు అర్జున్ కి అనుకోని వరంలా దొరికాడు దర్శకుడు సుకుమార్. రవితేజ హీరోగా తన మొదటి సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న సుకుమార్ కి అనుకోని విధంగా తారసపడ్డాడు అల్లు అర్జున్. తన సినిమాలోని కథానాయకుడికి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ అల్లు అర్జున్ లో కనపడటంతో ఇతనే తన ‘ఆర్య’ అని ఆరోజే ఫిక్స్ అయిపోయాడు దర్శకుడు సుకుమార్. ఇక ఆ తర్వాత అల్లు అరవింద్ కి నిర్మాత దిల్ రాజు, సుకుమార్ కథ చెప్పడంతో ఆయన చెప్పిన చిన్న చిన్న మార్పులతో ఆర్య సినిమా అల్లు అర్జున్ హీరోగా ఒకే అయ్యింది. ఆర్య సినిమాకి పనిచేసే టీం అంతా యంగ్ బాచ్ అవ్వడం ఆ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అప్పటికే డాన్స్ పరంగా ఎన్నో కొత్త కొత్త మూవ్మెంట్స్ నేర్చుకుని ఉన్న అల్లు అర్జున్ ఆర్య సినిమాలోని డాన్సులతో, మేక్ ఓవర్ తో ఆడియన్స్ కి పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఆర్య సినిమా విడుదల అయిన తర్వాత గంగోత్రిలో చేసిన కుర్రాడు ఇతడేనా? అబ్బ ఏం చేసాడు. ఏదేమైనా చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అంటే ఆ మాత్రం హుషారు వుంటుందిలే.. అంటూ ఆ సినిమాలోని పాటలకు, అల్లు అర్జున్ డాన్సులకు యూత్ ఆడియన్స్ అంతా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఆ సినిమాలో హీరో కోసం దర్శకుడు సుకుమార్ రాసుకున్న కారెక్టర్ యూత్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. అల్లరి చిల్లరిగా ఉంటూ ఒక నిజాయితీ కలిగిన ప్రేమికుడిగా అల్లు అర్జున్ తన రెండో సినిమాకే ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మన్స్ తెలుగు సినిమాకి మరో ఎనర్జటిక్ హీరోని అందించింది.
ముగ్గురూ..ముగ్గురే..తగ్గేదేలే.. అంటూ పుష్పరాజ్ గా, కొత్త రికార్డులు సృష్టిస్తున్న అల్లు అర్జున్ | Pushpa 2 Pre Release Business Create A History
ఆర్య సినిమాతో మొదలైన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల అనుభందం ఆ తరవాత ఆ తర్వాత ఆర్య2 తో మరింత బలపడింది. ఆర్య2 విడుదల సమయంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉండడంతో ఆ సినిమా కి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. అనుకున్నంత రేంజ్ లో ఆ సినిమా విజయం సాధించకపోయినా, ఆడియో పరంగా మాత్రం అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ మరో సంచలనం సృష్టించింది. హుషారైన దేవి శ్రీ ప్రసాద్ బీట్స్ కి అల్లు అర్జున్ అతి కష్టమన డాన్స్ మూవ్ మెంట్స్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో బెస్ట్ డాన్సర్ గా ఒక బలమైన ముద్ర వేసేసారు. దేవి శ్రీ ప్రసాద్ ఎంత మంది హీరోలకు మ్యూజిక్ ఇచ్చినా అల్లు అర్జున్ కి, దర్శకుడు సుకుమార్ కి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు అనే టాక్ అప్పటినుండే వచ్చింది. దానికి దేవి స్పందిస్తూ.. అలాంటిది ఏమి లేదని, దర్శకుడు సుకుమార్ తనకి ఇచ్చే ఇన్ పుట్స్ అలా ఉంటాయని, అలాగే ఎంత ఫాస్ట్ బీట్ కైనా బన్నీ డాన్స్ ఈజీగా చేస్తాడు కాబట్టి అలాంటి పాటలు తమ కాంబినేషన్ లో వచ్చాయని ఓ సందర్భంలో చెప్పాడు.
ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా, ఇద్దరీ సినిమా కెరీర్ ని మార్చేసిన సినిమా పుష్ప. రాంచరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా నుండి సుకుమార్ తన రూట్ కొద్దిగా మార్చుకున్నాడని చెప్పాలి. రంగస్థలం సినిమాకి ముందు సుకుమార్ సినిమాలు, ఆ సినిమాల కోసం ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటేడ్ గా ఉండేవి. సామాన్య ప్రేక్షకులకు పెద్దగా అర్ధం కాకుండా, కన్ఫ్యూషన్ లోకి నెట్టేవి. మహేశ్ బాబు తో సుకుమార్ తీసిన వన్ నేనొక్కడినే సినిమాలో అయితే ఈ కన్ఫ్యూషన్ మరీ ఎక్కువ. ఇక అలాంటి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించుకున్న దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా కోసం కొంచెం తన మార్క్ చూపిస్తూనే అద్దిరిపోయే స్క్రీన్ ప్లే, మన నేటివిటీ కి తగిన కథ రాసుకుని ఆ సినిమాతో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ చేసిన అధ్బుతమైన నటన చరణ్ కెరీర్ లోనే బెస్ట్ అనే విధంగా అందరూ కొనియాడారు. రంగస్థలం ఇచ్చిన ఎనర్జీ తో మరోసారి తన క్రియేటివిటీకి, మన నేటివిటీ టచ్ ఇచ్చి పుష్ప కథని రాసుకున్నారు సుకుమార్. ఈసారి బన్నీలోని మరో కోణాన్ని అధ్బుతంగా ఎలివేట్ చేసే కథ, కథనాలు పుష్ప మొదటి భాగంలో పక్కగా కుదిరాయి. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత పుష్ప సినిమా కథలోని డెప్త్ ఏంటో బాగా అర్ధం అయ్యింది అల్లు అర్జున్ కి అందుకే ఇది రెండు భాగాలుగా చేస్తే బాగుందని సుకుమార్ కి సలహా ఇచ్చారు అల్లు అర్జున్. సందేహ పడుతున్న సుకుమార్ ఈ విషయాన్ని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కి చెప్పడంతో ఆయన కూడా రెండు భాగాలుగా తీస్తేనే బాగుంటుందని చెప్పడంతో ధైర్యం చేసిన సుకుమార్ నిర్మాతలని ఒప్పించి రెండు భాగలుగా తీస్తున్నట్టు మీడియాకి తెలియజేసారు. పుష్ప మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అనే ట్యాగ్ లైన్ ని చేర్చారు.
ఒక ఐడియా జీవితాల్నే మార్చేసింది..
హీరో అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మలయాళం లోనూ మంచి మార్కెట్ ఉంది. అల్లు అర్జున్ – సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య మలయాళంలో డబ్బింగ్ అయ్యి సంచలన విజయం సాధించింది. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితమే బన్నీ కి మలయాళంలో మార్కెట్ ఏర్పడింది. అప్పటినుండి తెలుగులో బన్నీ చేసిన అన్ని సినిమాలు కేరళ లో మంచి విజయం సాధిస్తూ వస్తున్నాయి. అక్కడి అభిమానులు బన్నీని ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని కూడా పిలుచుకుంటారు. 2021 పుష్ప మొదటి భాగం విడుదల అయ్యే సమయానికే ఉత్తరాదిన కూడా తెలుగు సినిమాలకు ఆదరణ పెరగడంతో పుష్ప సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడదల చేయాలనే ఆలోచన అల్లు అర్జున్ కి వచ్చింది. తనకి ఇతర భాషల్లో మార్కెట్ పెరగాలంటే ఈ సినిమానే కరెక్ట్ అనే నమ్మకం బలపడింది. ఇదే విషయాన్ని దర్శకుడు సుకుమార్ చెప్తే వద్దులే డార్లింగ్ మన సినిమాని వాళ్ళెందుకు చూస్తారు అని ఒప్పుకోలేదట. కానీ బన్నీ పట్టుదల చూసి, సినిమా నిర్మాణ వ్యయం కూడా పెరగడంతో సుకుమార్ ఒకే చెప్పేశారు. డిసెంబర్ 17, 2021 డేట్ కి ఎలా అయినా రిలీజ్ చేయాలనీ పుష్ప చిత్ర యూనిట్ అప్పట్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసారు. మొత్తానికి అన్ని భాషల్లోనూ పుష్ప ది రైజ్ ని అనుకున్న టైం కి విడుదల చేసారు. ఇక్కడే అల్లు అర్జున్ ముందు చూపుని మెచ్చుకోవాలి. తెలుగులో మంచి టాక్ తో మొదలైన పుష్ప పార్ట్ 1 వారం తిరిగేటప్పటికి అన్ని భాషల్లోనూ రైజ్ అయ్యింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చేసిన మేజిక్ ఉత్తరాది ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అనుకరిస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ చేసిన ఎన్నో రీల్స్ పుష్ప సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. అసలు హిందీలో ఈ సినిమా ఆడుతుందా అని సందేహించిన వారికి అక్కడ 100 కోట్ల వసూళ్లు సాధించి మైండ్ బ్లాక్ అయ్యే సక్సెస్ ను సాధించింది. అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసింది.
పుష్ప..పుష్పరాజ్..నీ యవ్వ తగ్గేదే లే..
పుష్ప ది రైజ్ అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించడం వెనక అల్లు అర్జున్ వ్యూహాలు పక్కాగా వర్క్ ఔట్ అయ్యాయి. పుష్ప రెండో భాగం కోసం ఇప్పడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో కంగారు పడకుండా రెండో భాగం కథకు ఎన్నో మెరుగులు అద్దారు దర్శకుడు సుకుమార్. దానికి తగ్గట్టు గానే నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గకుండా భారీ వ్యయాన్ని ఈ సినిమా కోసం ఖర్చు చేసారు. ఫైనల్ గా పుష్ప ది రైజ్ విడుదల ఐన మూడేళ్ళ తర్వాత పుష్ప ది రూల్ ఈ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకి రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా సృష్టిస్తున్న ప్రీ రిలీజ్ రికార్డ్స్ తలపండిన సినీ పండితుల్ని సైతం షాక్ కి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకు జరగని బిజినెస్ ఈ సినిమా కోసం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా థియేటర్ రైట్స్ 220 కోట్లు, నార్త్ ఇండియా 200 కోట్లు, తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, మలయాళం థియేటర్ రైట్స్ 20 కోట్లు, ఓవర్సీస్ 120 కోట్లు అంటే టోటల్ గా థియేటర్ రైట్స్ 640 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ఒ క సంచలనం ని చెప్పాలి. ఇక డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 275 కోట్లకి కొనుగోలు చేయగా, మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ (టివి) 85 కోట్ల కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా బిజినెస్ జరిగింది. మొత్తానికి ఓవరాల్ గా 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో పుష్పరాజ్ ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకూ లేని కొత్త రికార్డు సృష్టించాడు. సినిమాపై అంచనాలు అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి అందులో సగం మొత్తం అడ్వాన్స్ టికెట్స్ రూపంలోనే పుష్పరాజ్ కొల్లగొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దర్శకుడు సుకుమార్ క్రియేటివిటీతో, పరిస్థితులని పక్కగా అంచనా వేసి, తనని తాను ఒక సూపర్ స్టార్ గా మలుచుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తాని మరోసారి చూపిస్తాడడనతంలో ఎలాంటి సందేహం లేదు. అల్ ది బెస్ట్ పుష్పరాజ్. ఈ కథనంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ మిత్రులకు ఈ కథనాన్ని షేర్ చేయండి.